మలక్‌పేట్‌లో బాలింతల మృతిపై ప్రాథమిక నివేదిక.. కారణాలివే..

17 Jan, 2023 13:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మలక్‌పేట్‌ బాలింతల మృతిపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందింది. స్టెఫలో కోకస్‌ బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్‌ సోకి బాలింతలు మృతి చెందారని కమిటీ నిర్ధారణకి వచ్చింది. సిజేరియన్‌ చేయించుకున్న 18 మందికి ఇన్ఫెక్షన్‌ సోకడంతో నిమ్స్‌కు తరలించారు. ఇందులో ఇద్దరు బాలింతల కిడ్నీలకు బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ సోకడంతో డయాలసిస్‌ కొనసాగుతోందని ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు.

రెండో కాన్పుకోసం వచ్చిన సిరివెన్నెల.. 
నాగర్‌ కర్నూలు జిల్లా వెల్దండ మండలం చెదురుపల్లి గ్రామానికి చెందిన పోలే మహేష్‌ భార్య సిరివెన్నెల (25) రెండో కాన్పు కోసం సోమవారం ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆమెకు బుధవారం సిజేరియన్‌ చేశారు. ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాతి కొద్ది సేపటికే  పల్స్‌ రేట్‌ ఒక్కసారిగా పడిపోయింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అత్యవసర వైద్య సేవల పేరుతో వైద్యులు ఆమెను గాంధీకి తరలించారు. 2డీ ఎకో పరీక్ష సహా ఇతర వైద్య పరీక్షలు చేశారు.

గురువారం రాత్రి పది గంటలకు మరణించింది. అయితే ఆమె గత ఐదు రోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రి వైద్యులు ఈ విషయాన్ని గుర్తించకుండా ఆమెకు సిజేరియన్‌ చేయడం, ప్లేట్‌లెట్స్‌ సంఖ్య పడిపోవడానికి కారణమయ్యారని మృతురాలి భర్త మహేష్‌ ఆరోపించారు. వీరికి ఏడాదిన్నర పాప కూడా ఉంది. ఆ పాప గుక్కపట్టి ఏడుస్తుండగా...అప్పుడే పుట్టిన శిశువు కనీసం ముర్రుపాలకు కూడా నోచుకోలేదని బంధువులు విలపించారు.   

తొలి కాన్పు కోసం వచ్చిన శివాని 
సైదాబాద్‌ పూసలబస్తీకి చెందిన రవీందర్, వెంకటలక్ష్మి కుమార్తె శివాని(25) మొదటి కాన్పు కోసం కుటుంబ సభ్యులు ఆమెను ఈనెల 10 తేదీన ఏరియా ఆసుపత్రిలో చేరి్పంచగా.. వైద్యులు బుధవారం ఉదయం సిజేరియన్‌ చేశారు. మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమె అకస్మాత్తుగా విరేచనాలతో బాధపడింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. అయితే బాలింత మరణానికి థైరాయిడ్‌ కారణమని వైద్యులు చెబుతుండగా, సిజేరియన్‌ తర్వాత కుట్లు వేసే సమయంలో సరిగా శుభ్రం చేయక పోవడం వల్లే తన భార్య చనిపోయిందని,  ఆరోగ్యంగా ఉన్న తన భార్య మృతికి ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆమె భర్త జగదీష్‌కుమార్‌ ఆరోపించారు. 

చదవండి: (Alert: హైదరాబాద్‌కు వస్తున్న వారికి పోలీసుల కీలక సూచన)

మరిన్ని వార్తలు