ఉచిత న్యాయసేవ ప్రజల హక్కు 

26 Sep, 2022 00:52 IST|Sakshi
జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌  

హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ 

ఖలీల్‌వాడి(నిజామాబాద్‌): ఉచిత న్యాయసేవలు పొందడం పౌరుల ప్రాథమిక హక్కు అని, దానిని ఎల్లవేళలా అందిస్తామని హైకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ అన్నారు. న్యాయసహాయం అందేలా న్యాయసేవలను మరింత విస్తృతం చేయాలని సూచించారు. ఆదివారం రోటరీక్లబ్‌ సహకారంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ సమీకృత కార్యాలయాల భవన సముదాయంలో 263 మందికి కృత్రిమకాళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జస్టిస్‌ భూయాన్‌ మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా అన్నిజిల్లాల్లో ఈ తరహా సేవా కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు.

ప్రభుత్వ వ్యవస్థలు, స్వచ్ఛంద సంస్థలను కలుపుకుని సామాజిక మార్పు, అన్నివర్గాల అభ్యున్నతే ధ్యేయంగా న్యాయవ్యవస్థ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోందన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్నికోర్టుల్లో 8 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. హైకోర్టు పరిధిలోనే రెండున్నర లక్షల కేసులు పరిష్కారం కావాల్సి ఉందని చెప్పారు. లోక్‌అదాలత్‌ల ద్వారా వివాదాల పరిష్కారానికి ముందుకు వస్తే అనేక పెండింగ్‌ కేసులు సత్వర పరిష్కారానికి నోచుకునే అవకాశం ఉందన్నారు.

పోక్సో కేసుల కోసం ప్రత్యేక కోర్టులు 
పోక్సో కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందించడానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీసుధ తెలిపారు. నేటి సమాజంలో ప్రజలు యాంత్రిక జీవితం గడుపుతున్నారని, ఇది అనేక అనర్థాలకు దారితీస్తోందని అభిప్రాయపడ్డారు. కుటుంబసభ్యులు పిల్లలకు మంచి సమాజాన్ని అందించేందుకు ప్రయత్నించాలని, తాము ఎటువైపు వెళ్తున్నామనేదానిపై ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, ఇన్‌చార్జి సీపీ శ్రీనివాస్‌రెడ్డి, హైకోర్టు బార్‌ కౌన్సిల్‌ సభ్యులు రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు