-

TS: వైద్య, ఆరోగ్యశాఖ, జీహెచ్‌ఎంసీకి జరిమానా

30 Jul, 2021 02:15 IST|Sakshi

కౌంటర్‌ దాఖలులో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం 

రూ.10 వేల చొప్పున న్యాయవాదుల

సంక్షేమ నిధికి జమచేయాలని ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: వేర్వేరు కేసుల్లో కౌంటర్లు దాఖలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య,ఆరోగ్య శాఖ, జీహెచ్‌ఎంసీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు సమయం వృథా చేసినందుకు రూ.10 వేల చొప్పున జరిమానాను న్యాయవాదుల సంక్షేమనిధికి జమ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. వైద్య,ఆరోగ్య శాఖలో డైటీషియన్‌ పోస్టుల భర్తీకి పేర్కొన్న నిబంధనలు, అర్హతలను సవాల్‌చేస్తూ వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో స్టాఫ్‌నర్స్‌గా విధులు నిర్వహిస్తున్న జె.సుజనతోపాటు మరికొందరు 2019లో పిటిషన్‌ దాఖలుచేశారు.

ఈ పిటిషన్‌లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రెండేళ్లయినా ఇప్పటికీ కౌంటర్‌ దాఖలు చేయకపోగా మరింత సమయం కోరడంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అలాగే నగరంలోని నాచారం పెద్ద చెరువు గరిష్ట నీటిమట్టం (ఎఫ్‌టీఎల్‌) పరిధిలో రోడ్డు వేయడాన్ని సవాల్‌చేస్తూ హెచ్‌ఎంటీ నగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ 2011లో హైకోర్టును ఆశ్రయించింది. పదేళ్లుగా ఈ పిటిషన్‌లో జీహెచ్‌ఎంసీ కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్ణీత సమయంలోగా కౌంటర్లు దాఖలు చేయకపోతే జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది.  

మరిన్ని వార్తలు