TS: బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌: తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

15 Mar, 2022 01:34 IST|Sakshi

సభకు స్పీకర్‌ గార్డియన్‌

పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి 

బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై హైకోర్టు తీర్పు 

ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శికి వినతిపత్రం ఇవ్వాలి 

మంగళవారం సభకు ముందే కార్యదర్శి వారిని స్పీకర్‌ వద్దకు తీసుకెళ్లాలి 

స్పీకర్‌ తగిన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం 

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ఎన్నికైన ప్రజాప్రతినిధులను శాసనసభ సమావేశాలకు అనుమతించాలని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రశ్నించే వారిని సభకు అనుమతించినప్పుడే ప్రజాస్వామ్యం పరిపూర్ణం అవుతుందని పేర్కొంది. శాసనసభకు స్పీకర్‌ గార్డియన్‌ లాంటి వారని, పార్టీలకు అతీతంగా స్వతంత్రంగా, నిష్పాక్షికంగా వ్యవహరించాలని సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్, జస్టిస్‌ ఎ.వెంకటేశ్వర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పునిచ్చింది. తమను సస్పెండ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సింగిల్‌ జడ్జి కొట్టివేయడంపై.. బీజేపీ ఎమ్మెల్యేలు రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావులు దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం విచారించింది. శాసనసభ నియమావళికి విరుద్ధంగా, సహేతుకమైన కారణం లేకుండానే ఈ సెషన్‌ మొత్తం సభకు హాజరుకాకుండా బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారని వారి తరఫు సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. కాగా స్పీకర్‌ అధికారాల్లో జోక్యం చేసుకునే అధికారం న్యాయస్థానాలకు లేదని, ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులను అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ ప్రస్తావించారు. వాదనల అనంతరం ధర్మాసనం తీర్పు వెలువరించింది. 

తగిన నిర్ణయం తీసుకోండి 
శాసనసభ్యులను సహేతుకమైన కారణాలు లేకుండా సస్పెండ్‌ చేయడం వారి హక్కులను హరించడమేనని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌కు సహేతుకమైన కారణాలు లేవని భావిస్తున్నామంది. సస్పెండైన ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ రోజే శాసనసభ కార్యదర్శిని కలిసి వినతిపత్రం సమర్పించాలని, సమావేశాలకు అనుమతించాల్సిందిగా కోరాలని సూచించింది. కార్యదర్శి వీరిని మంగళవారం సభకు ముందే స్పీకర్‌ దగ్గరికి తీసుకెళ్లాలని, వారి అభ్యర్థనను స్పీకర్‌ విని తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఉన్నత రాజ్యాంగ హోదా కల్గిన స్పీకర్‌ ఈ ఘర్షణ వాతావరణాన్ని సామరస్యంగా, న్యాయబద్ధంగా పరిష్కరిస్తారనే నమ్మకముందని ఆశాభావం వ్యక్తం చేసింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలు, సాంప్రదాయాలకు అనుగుణంగా బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ ఎత్తివేసి సమావేశాలకు హాజరయ్యేలా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ‘‘స్పీకర్‌ అధికారాల్లో జోక్యం చేసుకోరాదన్న సింగిల్‌ జడ్జి తీర్పుసరికాదు. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ అధికారాల్లో స్పష్టమైన విభజన రేఖ ఉంది. అయినా చట్ట నిబంధనలను ఉల్లంఘించినప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు..’అని పేర్కొంది. అప్పీల్‌ దాఖలు చేసినట్లు తాము నోటీసులు పంపినా శాసనసభ కార్యదర్శి, శాసనసభ సెక్రటేరియట్‌ కార్యదర్శి తరఫున ఎవరూ హాజరుకాలేదని వ్యాఖ్యానించింది. 

ఎట్టకేలకు నోటీసులు తీసుకున్న కార్యదర్శి 
సింగిల్‌ జడ్జి తీర్పుపై దాఖలు చేసిన అప్పీల్‌కు సంబంధించి ప్రతివాదిగా ఉన్న శాసనసభ కార్యదర్శి నోటీసులు తీసుకోవడం లేదంటూ ప్రకాశ్‌రెడ్డి ఉదయం విచారణ సందర్భంగా ధర్మా సనం దృష్టికి తెచ్చారు. దీంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టు రిజిస్ట్రార్‌ (జ్యుడీషియల్‌) వెళ్లి నోటీసులు అందజేయాలని, నగర పోలీసు కమిషనర్‌ ఇందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశిస్తూ విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కార్యదర్శి నోటీసులు అందుకున్నారు. ఈ మేరకు రిజిస్ట్రార్‌ సాయంత్రం 4 గంటల సమయంలో ధర్మాసనానికి నివేదించారు.  

‘నేటి ఉదయం స్పీకర్‌ను కలుస్తాం’ 
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని మంగళవారం ఉదయం 9 గంటలకు కలసి తమ సస్పెన్షన్‌పై హైకోర్టు తీర్పు ఉత్తర్వులు అందజేస్తామని బీజేపీ ఎమ్మెల్యేలు టి.రాజాసింగ్, ఎం.రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌ తెలిపారు. బడ్జెట్‌ సమావేశాలు మంగళవారమే ముగియనున్నందున ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ స్పీకర్‌ తమను సభలోకి అనుమతిస్తారనే విశ్వాసం ఉందన్నారు. సోమవారం రాత్రి బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గౌర వించకపోతే మళ్లీ హైకోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు పొందుతామని చెప్పారు. తమ  గొంతులు నొక్కుతామంటే ప్రజలు రాబోయే రోజుల్లో కేసీఆర్‌నే బహిష్కరిస్తారని ఈటల హెచ్చరించారు. అహంకారంతో వ్యవహరిస్తున్న రావణాసురుడిని (కేసీఆర్‌)ను ఎదుర్కొనేందుకు ‘ట్రిపుల్‌ ఆర్‌’గా  అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నామని చెప్పారు.   

మరిన్ని వార్తలు