మరో 4 వారాలు గడువిస్తున్నాం: హైకోర్టు

3 Jul, 2021 08:56 IST|Sakshi

127 వృత్తుల్లోని కార్మికుల వివరాలు పోర్టల్‌లో నమోదు చేయండి

సర్కారుకు హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా అసంఘటిత రంగంలోని కార్మికుల వివరాలను నాలుగు వారాల్లోగా నమోదు (రిజిస్ట్రర్‌) చేయాలన్న తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 127 వృత్తుల్లోని కార్మికుల వివరాలను మరో నాలుగు వారాల్లోగా పోర్టల్‌లో నమోదు చేయాలని, ఈ మేరకు తీసుకున్న చర్యలను వివరిస్తూ స్థాయి నివేదిక సమర్పించాలని కార్మిక శాఖ కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం సామాజిక భద్రతా బోర్డు ఏర్పాటు చేయకపోవడాన్ని సవాల్‌ చేస్తూ మాజీ ఉప ముఖ్యమంత్రి సి.దామోదర రాజనర్సింహ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం మళ్లీ విచారించింది. జూలై 31లోగా కార్మికుల వివరాలను పోర్టల్‌లో నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిందని, ఈ మేరకు అన్ని జిల్లాల కార్మిక శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. ఆ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ధర్మాసనం కార్మిక శాఖను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 25కి వాయిదా వేసింది. 
 

>
మరిన్ని వార్తలు