TS: ఔట్‌సోర్సింగ్‌లో అధ్యాపకులా?

30 Jul, 2021 04:07 IST|Sakshi

ఇక్కడే ఇలా ఉందా... దేశంలో ఇంకెక్కడైనా ఉందా?

నియామకాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో అధ్యాపకులను ఔట్‌ సోర్సింగ్‌/కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తుండటంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఈ రాష్ట్రంలోనే ఈ తరహా నియామకాలు జరుగుతున్నాయా? దేశంలో మరెక్కడైనా ఇలా చేస్తున్నారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో అధ్యాపకులను రెగ్యులర్‌ పద్ధతిలో నియమిస్తేనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కళాశాలల్లో అధ్యాపక నియామకాలకు సంబంధించి ఉన్న నియమ నిబంధనలను పేర్కొంటూ పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆర్థిక, పాఠశాల, సాంకేతిక విద్య ముఖ్య కార్యదర్శులతోపాటు జేఎన్‌టీయూ, ఉస్మానియా వర్సిటీ రిజిస్ట్రార్‌లను, ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) కార్యదర్శిని ఆదేశించింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలోనే నియామకాలు చేస్తుండటంతోపాటు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల అధ్యాపకులకు వేతనాలు ఇవ్వడం లేదంటూ న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్‌ రాసిన లేఖను ధర్మాసనం సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా విచారణకు స్వీకరించింది.

‘కరోనాతో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో వేలాది మంది అధ్యాపకులను తొలగించగా... విధులు నిర్వహిస్తున్న వారికీ వేతనాలు ఇవ్వడం లేదు’ అని శ్రవణ్‌కుమార్‌ లేఖలో పేర్కొన్నారు. తమ గుర్తింపు ఉన్న కళాశాలల్లో అధ్యాపకుల నియామకాలకు ఓ ప్రత్యేక కమిటీ ఉంటుందని జేఎన్‌టీయూ తరఫు న్యాయవాది నివేదించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం...నాణ్యమైన విద్య అందించేందుకు తీసుకుంటున్న చర్యలతోపాటు, అధ్యాపకుల నియామకాలకు సంబంధించి ఉన్న నియమ నిబం ధనలను పేర్కొంటూ పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్‌ 29కి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు