Covid-19: భయం తగ్గింది.. మాస్కులేసుకోవడం మానేశారు

12 Oct, 2021 07:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భౌతిక దూరం పాటించడమే లేదు ∙ 

25 లక్షల మంది గడువు దాటినా రెండో డోసు టీకా తీసుకోలేదు

అజాగ్రత్తగా ఉంటే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.. 

ఈ 3 నెలలు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి:  వైద్య, ఆరోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కోవిడ్‌ ఇంకా కనుమరుగు కాలేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య విభాగం సంచాలకుడు జి. శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కోవిడ్‌ తీవ్రత తగ్గిందని, రోజుకు సగటున రెండొందల మంది వైరస్‌బారిన పడుతున్నట్లు తెలిపారు. కోవిడ్‌ మూడో దశ వ్యాప్తిపై స్పష్టత లేనప్పటికీ ప్రజలు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు తీసుకునే జాగ్రత్తలపైనే వైరస్‌ కట్టడి ఆధారపడి ఉంటుందన్నారు. సోమవారం తన కార్యాలయంలో మీడియాతో కోవిడ్, సీజనల్‌ వ్యాధులపై శ్రీనివాసరావు మాట్లాడారు. 

‘ఈ ఏడాది జూన్‌లో 85–90% మధ్య ఉన్న మాస్కుల వినియోగం ప్రస్తుతం 15శాతానికి పడిపోయింది. భౌతికదూరం నిబంధనను ఎవరూ పాటించడం లేదు. అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు మూడు మాసాలు అత్యంత కీలకం. ప్రస్తుతం పండుగ సమయం కావడంతో రోడ్లపై రద్దీ పెరిగింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు. జనసమూహాలున్న చోటకు వెళ్లడం తగ్గించుకోవాలి. ఈ మూడు నెలలు ప్రతి ఒక్కరూ తప్పకుండా కోవిడ్‌ నిబంధనలు పాటించాలి. మూడు నెలల తర్వాత ఎలాంటి వేరియంట్‌ వచ్చినా మనకేమీ కాదు. కానీ జాగ్రత్తలు మరిస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’ అని శ్రీనివాసరావు హెచ్చరించారు. 

పొరుగు రాష్ట్రాల్లో అధిక కేసులు... 
‘రాష్ట్రంలో కోవిడ్‌ నియంత్రణలోకి వచ్చినప్పటికీ పొరుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం రాకపోకలు విపరీతం కావడంతో అంతర్రాష్ట్ర ప్రయాణికులు ఎక్కువ మంది వస్తున్నారు. ఇటీవల కోవిడ్‌తో 17 ఏళ్ల బాలిక మరణించింది. ప్రస్తుతం నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో ఎక్కువ మంది వ్యాక్సిన్‌ తీసుకోని వారే ఉంటున్నారు’అని శ్రీనివాసరావు పేర్కొన్నారు. 

9 వేల కేంద్రాల్లో టీకాలు... 
‘రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ విస్తృతంగా సాగుతోంది. 9వేల కేంద్రాల్లో టీకాలు ఇస్తున్నాం. ప్రస్తుతం 30 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారిలో మొదటి డోస్‌ 72 శాతం మందికి ఇచ్చాం. ఇప్పటికే 2 కోట్లకుపైగా తొలి డోసు అందించగా వారిలో 32 శాతం మంది రెండో డోసు కూడా తీసుకున్నారు. రాష్ట్రంలో 25 లక్షల మంది మొదటి డోసు తీసుకుని గడువు దాటినా రెండో డోసు తీసుకోలేదు. వారంతా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు చెందిన వారే. టీకా తీసుకున్న వారికి కోవిడ్‌ వచ్చినా రిస్క్‌ ఉండదని శాస్త్రీయంగా రుజువైంది. రాష్ట్రంలో 1.2 కోట్ల మంది 18 ఏళ్ల లోపు వారు ఉన్నారు. వారికి టీకా ఇవ్వాలని కేంద్రం ఆదేశిస్తే వేగంగా చర్యలు చేపడతాం’ అని శ్రీనివాసరావు వివరించారు.  కాగా, రాష్ట్రంలో కొత్తగా 183 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ఇప్పటివరకు 6,68,070 మంది కరోనా బారిన పడగా.. 6,59,942 మంది కోలుకున్నారు. 
 

మరిన్ని వార్తలు