ఏపీకి 58.32.. తెలంగాణకు 41.68%

12 Mar, 2021 03:06 IST|Sakshi

ఉమ్మడి ఏపీ డెయిరీ కార్పొరేషన్‌ ఆస్తులపై హైకోర్టు తీర్పు

పరిపాలనా భవనం, వసతి గృహం, బ్యాంకుల్లోని నగదు పంచుకోవాలి

ఆపరేషనల్‌ యూనిట్స్‌ మాత్రం ఏ రాష్ట్రంలో ఉన్నవి ఆ రాష్ట్రానికే..

విజయ డెయిరీ తెలంగాణకే.. అది ఉమ్మడి ఆస్తి అనలేమని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌:  ఉమ్మడి ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌డీడీసీఎఫ్‌)కు చెందిన ఆస్తులను ఏపీ 58.32 శాతం, తెలంగాణ 41.68 నిష్పత్తిలో పంచుకోవాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. హైదరాబాద్‌లోని ఏపీఎస్‌డీడీసీఎఫ్‌ పరిపాలనా భవనం, వసతి గృహాలను, వివిధ బ్యాంకుల్లో ఉన్న రూ.54 కోట్ల సొమ్మును కూడా ఇదే నిష్పత్తిలో పంచుకోవాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని.. ఆపరేషనల్‌ యూనిట్స్‌ (డెయిరీ, ఇతర తయారీ యూనిట్స్‌) మాత్రం ఏ రాష్ట్రంలో ఉన్నవి ఆ రాష్ట్రానికే కేటాయించాలని పేర్కొంది. హైదరాబాద్‌ లాలాగూడలోని విజయ డెయిరీ తెలంగాణకే చెందుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏపీఎస్‌డీడీసీఎఫ్‌ లిమిటెడ్‌ ఆస్తులను తమకుతాము కేటాయించుకుంటూ 2016 మే, 6న జారీ చేసిన జీవో 8ను కొట్టివేసింది. ఆ జీవో పునర్విభజన చట్టానికి విరుద్ధమని తేల్చిచెప్పింది. ఏపీఎస్‌డీడీసీఎఫ్‌ ఆస్తులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవో 8ను సవాల్‌ చేస్తూ ఫెడరేషన్‌ ఎండీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుదీర్ఘంగా విచారించిన హైకోర్టు గురువారం తీర్పునిచ్చింది.

తెలంగాణకు రెండు, ఏపీకి రెండు అంతస్తులు 
ఏపీఎస్‌డీడీసీఎఫ్‌ లిమిటెడ్‌ పరిపాలనా భవనాన్ని జనాభా నిష్పత్తి ఆధారంగా తెలంగాణ, ఏపీ సమానంగా పంచుకోవాలని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం తమ తీర్పులో పేర్కొంది. ‘‘2015 డిసెంబర్‌ 18న ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల జాయింట్‌ జనరల్‌ బాడీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం 58, 42 నిష్పత్తిలో విభజించాలి. గ్రౌండ్‌ ఫ్లోర్స్‌ను ఇరు రాష్ట్రాలు ఉపయోగించుకునేలా.. మొదటి, రెండు అంతస్తులు తెలంగాణకు, మూడు, నాలుగో అంతస్తులు ఏపీకి కేటాయించాలి. ఆపరేషనల్‌ యూనిట్స్‌ స్థానికత ఆధారంగా ఆయా రాష్ట్రాలకే చెందుతాయి. 2014 జూన్‌ 2 నాటికి ఆరు బ్యాంకుల్లో ఉన్న నగదు నిల్వలు రూ.54 కోట్లను 58.32, 41.68 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ పంచుకోవాలి. సోమాజిగూడలోని వసతి గృహం విలువను లెక్కించేందుకు ఏపీ ప్రభుత్వం కాగ్‌ను సంప్రదించాలి. కాగ్‌ 8 వారాల్లోగా విలువ లెక్కగట్టి ఇరు రాష్ట్రాలకు తెలియజేయాలి. కాగ్‌ రిపోర్టు అందిన మూడు నెలల్లోగా తెలంగాణ స్టేట్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ 58.32 వాటాను ఏపీ డెయిరీ కార్పొరేషన్‌కు బదిలీ చేయాలి..’’అని ఆదేశించింది.  

మరిన్ని వార్తలు