‘డీఎల్‌ఎఫ్‌’ భూ వ్యవహారంపై కౌంటర్‌ వేయండి

31 Dec, 2020 09:00 IST|Sakshi

డీఎల్‌ఎఫ్‌ వ్యవహారంలో ప్రతివాదులకు హైకోర్టు ఆదేశం

‘ఓట్ల నమోదులో అక్రమాలు’: హైకోర్టు స్పందన

సాక్షి, హైదరాబాద్‌: డీఎల్‌ఎఫ్‌ భూవ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ ఎంపీ రేవంత్‌ రెడ్డి దాఖలు చేసిన ప్రజాహితవ్యాజ్యంపై కౌంటర్‌ దాఖలు చేయాలంటూ హైకోర్టు బుధవారం ప్రతివాదులను ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో ఏపీఐఐసీకి చెందిన ఐటీ పార్క్‌లో డీఎల్‌ఎఫ్‌ సంస్థ 31.35 ఎక రాలను రూ.580 కోట్లకు కొనుగోలు చేసిన వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ ఎంపీ రేవంత్‌రెడ్డి ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శులతోపాటు టీఎస్‌ఐఐసీ, ఎస్‌బీఐ, డీఎల్‌ఎఫ్, మై హోం కన్‌స్ట్రక్షన్స్, ఆర్‌ఎంజడ్‌ కార్ప్‌ సంస్థలను పేర్కొన్నారు.

ఈ మేరకు వీరు కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌ రెడ్డితో కూడిన ధర్మాసనం ఆదేశించింది. నిబంధనల మేరకే ఈ భూమి కొనుగోలు ప్రక్రియ జరిగిందని, ఆక్వా స్పేస్‌ డెవలపర్స్‌ తరఫున జె.శ్యామ్‌రాం బుధవారం కౌంటర్‌ దాఖలు చేశారు. కాగా, 2013లో డీఎల్‌ఎఫ్‌కు ఏపీఐఐసీ భూమి రిజిస్ట్రేషన్‌ చేయడం, తర్వాత ఆ భూమిని ఆక్వా స్పేస్‌ పేరుతో బదలాయించడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని, భవన నిర్మాణం కోసం జీహెచ్‌ఎంసీ ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని రేవంత్‌రెడ్డి పిటిషన్‌లో కోరారు. (చదవండి: విక్రమ్‌కు ఎంబీబీఎస్‌ అడ్మిషన్‌ ఇవ్వండి )  

జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీకి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీలో ఓట్ల నమోదులో అనేక అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఆరోపణలపై తుది తీర్పు ఇచ్చే వరకూ కార్యవర్గం ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీచేయరాదని, ఎన్నికలు నిర్వహించరాదని రాష్ట్ర కోఆపరేటివ్‌ ఎన్నికల అధికారిని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచందర్‌రావు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.

మరిన్ని వార్తలు