‘డ్రగ్స్‌’ వివరాలు ఎందుకు దాస్తున్నారు: హైకోర్టు

30 Apr, 2021 11:34 IST|Sakshi

నార్కోటిక్స్‌ కంట్రోల్‌ విభాగం ఏం చేస్తోంది ?

సర్కారు తీరుపై హైకోర్టు అసహనం

కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశం  

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివార్లలోని కొన్ని ప్రైవేట్‌ ఇంజనీరింగ్, ఇతర కళాశాలల్లో విద్యార్థులు విచ్చలవిడిగా డ్రగ్స్‌ తీసుకుంటున్నా పట్టించుకునే వారే లేరని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. డ్రగ్స్‌ సరఫరాను నియంత్రించాల్సిన నార్కోటిక్స్‌ కంట్రోల్‌ విభాగం ఏం చేస్తోందని ప్రశ్నించింది. 2016లో రాష్ట్రంలో వెలుగు చూసిన డ్రగ్స్‌ కేసులను సీబీఐ లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అప్పగించాలని కోరుతూ మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. డ్రగ్స్‌ కేసుల విచారణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు రాష్ట్ర ఎక్సైజ్‌ అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని పిటిషనర్‌ తరఫున న్యాయవాది రచనారెడ్డి నివేదించారు.

ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రస్తావించింది. తమకు సమాచారం ఇవ్వడం లేదని ఈడీ తరఫు న్యాయవాది ధర్మాసనానికి నివేదించారు. ఎఫ్‌ఐఆర్, చార్జిషీట్, సాక్షుల వాంగ్మూలాలు ఇవ్వాలని పలుమార్లు కోరినా స్పందన లేదని, ఈ నేపథ్యంలో ఈ వివరాలు సమర్పించేలా ఎక్సైజ్‌ అధికారులను ఆదేశించాలని కోరారు. ‘డ్రగ్స్‌ సరఫరా చేసే, వినియోగించే వారి వివరాలను ఎందుకు దాస్తున్నారు? కేంద్ర ప్రభుత్వ సంస్థలు కోరిన సమాచారాన్ని ఎందుకు ఇవ్వడం లేదు’అని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నాలుగు వారాల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణను జూన్‌కు వాయిదా వేసింది.

చదవండి: ప్రాణాలకన్నా ఎన్నికలు ముఖ్యమా?   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు