గ్రేటర్‌‌ ఎన్నికలు: హైకోర్టు కీలక నిర్ణయం

18 Nov, 2020 12:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల పిల్‌పై అత్యవసరంగా విచారించలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. రిజర్వేషన్లు రొటేషన్‌ పద్ధతి లేకుండా ఎన్నికలు నిర్వహించడం చట్టవిరుద్దమని, మున్సిపల్‌ యాక్ట్‌ 52ఈను సవాల్‌ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. పిటిషన్‌ లంచ్‌ మోషన్‌కు అనుమతి ఇవ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. ఈ పటిషన్లపై‌ లంచ్‌మోషన్‌ విచారణను హైకోర్టు చీఫ్‌ జస్టిస్ నిరాకరించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నోటిఫికేషన్‌ మంగళవారం విడుదలైన విషయం తెలిసిందే. డిసెంబర్‌ 1న పోలింగ్‌ నిర్వహిస్తామని, 4న ఫలితాలను ప్రకటిస్తామని రాష్ట్ర ఎ‍న్నికల సంఘం కమిషనర్‌ పార్థసారథి తెలిపారు.  

నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం:
జీహెచ్‌ఎంసీలో నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. అన్ని జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయాల్లో మధ్యాహ్నం 3 గంటలకు వరకు అధికారులు అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈనెల 20 వరకు నామినేషన్ల దాఖలు చేయడానికి గడువు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఉమ్మడిగా ప్రకటించనున్నట్లు లెఫ్ట్ పార్టీలు తెలిపాయి. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సీపీఐ, సీపీఎం పార్టీలు పేర్కొన్నాయి. 

మరిన్ని వార్తలు