యశోద ఆసుపత్రిపై ఎందుకంత ప్రేమ?

27 Nov, 2020 08:05 IST|Sakshi

కరోనా పరీక్షలపై ఉద్దేశపూర్వకంగానే మా ఆదేశాల అమలులో నిర్లక్ష్యం

పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ.. కౌంటర్‌ దాఖలుకు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌ : రోజూ 50 వేల కరోనా పరీక్షలు, వారానికోసారి లక్ష పరీక్షలు చేయాలన్న తమ ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రజారోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగానే తమ ఆదేశాలను అమలు చేయలేదని, డాక్టర్‌ శ్రీనివాసరావుపై కోర్టుధిక్కరణ కింద చర్యలు తప్పవని హెచ్చరించింది. తమ ఆదేశాలపై అభ్యంతరముంటే అప్పీల్‌ చేసుకోవచ్చని, అంతేగానీ లెక్కలేనట్టు వ్యవహరిస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించింది. ఈ మేరకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశించింది.

కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని, ప్రైవేటు ఆసుపత్రుల ఫీజు దోపిడీని నియంత్రించాలంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా విచారణకు డాక్టర్‌ శ్రీనివాసరావు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు. రోజుకు 50 వేల పరీక్షలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే ఇంకా ఎక్కువ చేసేందుకూ సిద్ధమని డాక్టర్‌ శ్రీనివాసరావు నివేదిక సమర్పించడంపై ధర్మాసనం మండిపడింది. రోజుకు 50 వేల పరీక్షలు తప్పకుండా చేయాలని ఈనెల 19న తాము ఆదేశించినా ఎందుకు చేయలేదని ప్రశ్నించింది. ఈ వారంలో రోజుకు 40 నుంచి 42 వేలలోపు మాత్రమే పరీక్షలు చేశారని, కోర్టు ఆదేశాల అమలులో అధికారులు  బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని మండిపడింది.

ఏపీలో ప్రతి మిలియన్‌కు 1.85 లక్షల పరీక్షలు 
‘ఏపీలో ప్రతి పది లక్షల (మిలియన్‌) జనాభాకు 1,85,025 మందికి పరీక్షలు చేశారు. ఢిల్లీలో 2.95 లక్షలు, కేరళలో 1.67 లక్షల పరీక్షలు చేయగా, తెలంగాణలో 1.39 లక్షల పరీక్షలే చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ పరీక్షల సంఖ్య చాలా తక్కువుంది. వెంటనే పరీక్షలు పెంచాలి. రోజూ 50 వేలకు తగ్గకుండా చేయాలి. వారంలో ఒకరోజు లక్ష పరీక్షలకు తగ్గకుండా చేయాలి. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష ల్యాబ్‌లను పెంచుతామని రెండు నెలల క్రితం హామీనిచ్చారు. ప్రస్తుతం ఉన్న 17కు అదనంగా 6 ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రెండు నెలలు గడిచినా ఒక ల్యాబ్‌ను మాత్రమే పెంచారు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా, కరోనా కారణంగా కుటుంబసభ్యులను, ఉపాధిని కోల్పోయిన వారు మానసిక సంఘర్షణలో ఉంటారని, వారి కోసం మానసిక చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలని రెండు నెలల క్రితం ఆదేశించినా ఇప్పటికీ అమలు చేయలేదని పేర్కొంది. తదుపరి విచారణను డిసెంబర్‌ 17కు వాయిదా వేసింది.

‘యశోద’పై ఎందుకంత ప్రేమ?  
‘సన్‌షైన్‌ ఆసుపత్రిపై 14, కేర్‌పై 10, మెడీకవర్‌పై 8, కిమ్స్‌పై 13, విరించి ఆసుపత్రిపై 19 ఫిర్యాదులు వచ్చాయి. సోమాజిగూడ, సికింద్రాబాద్‌ల్లోని యశోద ఆసుపత్రులపై ఎక్కువ బిల్లులు వసూలు చేశారంటూ అత్యధికంగా 33 ఫిర్యాదులొచ్చాయి. యశోదపై ఇన్ని ఫిర్యాదులొచ్చినా చర్యలెందుకు తీసుకోలేదు?. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేశాయంటూ డెక్కన్, విరించి ఆసుప్రతులపై మాత్రమే ఎందుకు చర్యలు తీసుకున్నారు?. యశోద ఆసుపత్రి అంటే ఎందుకంత ప్రేమ?’అని శ్రీనివాసరావును ధర్మాసనం ప్రశ్నించింది. ప్రైవేటు ఆసుపత్రులపై 276 ఫిర్యాదులు రాగా 154 పరిష్కరించామని, 122 పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారని, తదుపరి విచారణలోగా పెండింగ్‌లో ఉన్న 122 ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారో స్పష్టంగా నివేదికనివ్వాలని ఆదేశించింది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు