Telangana High Court: గర్భిణీ మృతి ఘటనపై హైకోర్టు ఆగ్రహం

17 May, 2021 15:57 IST|Sakshi

విచారణ చేసి వివరాలు సమర్పించండి

తెలంగాణలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహణపై హైకోర్టు ప్రశ్న

మిగతా రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఇక్కడెందుకు వ్యాక్సినేషన్‌ జరగడం లేదు: హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను ఎందుకు నిర్వహించడంలేదని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా.. ఇతర రాష్ట్రాల వలె తెలంగాణలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ఎందుకు లేదని హైకోర్టు ప్రశ్నించింది. వ్యాక్సినేషన్‌లో తెలంగాణ 15వ స్థానంలో ఉందని పిటిషనర్లు హైకోర్టుకు తెలిపారు. బెడ్స్‌ సామర్థ్యం ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఒకలా, గ్రౌండ్‌ లెవల్‌లో మరో సంఖ్య ఉందని వివరించారు. మొదటి దశలో ప్రైవేట్ ఆస్పత్రుల చార్జీలపై ఫిర్యాదులకు ముగ్గురు ఐఏఎస్‌లతో కూడిన టాస్క్ ఫోర్స్ కమిటీ వేశారని హైకోర్టుకు తెలిపారు. కానీ ఇప్పుడు ఆ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పిటిషనర్లు హైకోర్టుకు వెల్లడించారు.

దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స, సిటీ స్కాన్‌, టెస్టులకు ధర నిర్ణయించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గతంలో ఇచ్చిన జీవో ఇప్పుడు సరిపోదని, కొత్తగా ధరలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల అక్రమాలపై ముగ్గురు సభ్యుల కమిటీ వేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.  విచారణలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు హాజరయ్యారు. లాక్‌డౌన్‌ వీడియోగ్రఫీని ముగ్గురు కమిషనర్లు హైకోర్టుకు సమర్పించారు. జైళ్ల శాఖలో కరోనా కేసులు, వ్యాక్సినేషన్‌ పూర్తిపై కోర్టుకు నివేదిక అందజేశారు. కేంద్రం నుంచి 650 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్, 10వేల రెమిడెసివిర్ ఇంజక్షన్లు వస్తున్నాయని అడ్వకేట్‌ జనరల్ హైకోర్టుకు తెలియజేశారు.

గర్భిణీ మృతి ఘటనపై హైకోర్టు సీరియస్‌
అదే విధంగా మల్లాపూర్‌లో గర్భిణీ మృతి ఘటనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గర్భిణీ మృతి ఘటనపై విచారణ చేసి వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ప్రతి జిల్లాలో కమ్యూనిటీ కిచన్‌లు ఏర్పాటు చేసి లాక్‌డౌన్‌లో ఉచిత భోజనం కల్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

కార్పొరేషన్లు, ఎన్జీఓలతో ఒప్పందం చేసుకుని కమ్యూనిటీ కిచన్‌లు  ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలంది. ప్రతి జిల్లా వెబ్‌సైట్‌లో కమ్యూనిటీ కిచన్ వివరాలు పొందుపరచాలని తెలిపింది. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ఈఎన్‌టీ ఆస్పత్రులు ఏర్పాటు చేశామని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలియజేశారు. కమ్యూనిటీ సెంటర్లను టెస్టింగ్, ఐసోలేషన్‌ సెంటర్లుగా పరిగణించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను హైకోర్టు జూన్ 1కి వాయిదా వేసింది.
చదవండి: Corona: పిల్లల్లో ఈ లక్షణాలుంటే నిర్లక్ష్యం వద్దు

మరిన్ని వార్తలు