టీఎస్‌ ఐసెట్‌కు ఏర్పాట్లు పూర్తి

29 Sep, 2020 08:11 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేవశానికి నిర్వహించే టీఎస్‌ ఐసెట్‌ ఈనెల 30న, అక్టోబర్‌ 1వ తేదిల్లో జరగునుందని టీఎస్‌ ఐసెట్‌ కన్వీనర్‌ ఆచార్య రాజీరెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన  మీడియాతో మాట్లాడుతూ.. పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. పరీక్షకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన 58, 452 అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు.  రెండు రాష్ట్రాల్లో కలిపి 14 రీజనల్‌ సెంటర్లు, 70 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 30 వ తేదీన ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్ ఉంటుందన్నారు.

రెండవ రోజు అక్టోబర్‌ 1న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కరోనా నిబంధనలకు అనుగుణంగా మాస్క్‌ ధరించి శానిటైజర్‌ బాటిల్‌తో పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. బయోమెట్రిక్‌ ద్వారా కాకుండా ఫొటో క్యాప్చర్‌ విధానంతో అభ్యర్థుల హాజరును నమోదు చేస్తామని తెలిపారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు, పెన్ను తెచ్చుకోవాలని ఆయన తెలిపారు. 

>
మరిన్ని వార్తలు