ఇంటర్‌‘నెట్‌’ స్టడీతో ఫస్టియర్‌ ఫట్‌..!

17 Dec, 2021 02:02 IST|Sakshi

ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత 49శాతమే

ఫలితాల్లో బాలికలు టాప్‌..56% మంది పాస్‌

జిల్లాల వారీగా మేడ్చల్‌ ఫస్ట్‌.. మెదక్‌ లాస్ట్‌

నేటి నుంచి మార్కుల డౌన్‌లోడ్‌

సాక్షి, హైదరాబాద్‌: అదిగో.. ఇదిగో.. అంటూ ఫలితాల విషయంలో విద్యార్థులను హైరానా పెట్టిన ఇంటర్‌ బోర్డు ఎట్టకేలకు గురువారం ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాలను విడుదల చేసింది. ఒకేషనల్స్‌తో కలిపి రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలకు 4,59,242 మంది విద్యార్థులు హాజరవగా 2,24,012 (49 శాతం) మందే పాసయ్యారు. ఫలితాల్లో బాలికలు ముందు వరుసలో నిలిచారు. బాలికలు 56 శాతం మంది, బాలురు 42 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మేడ్చల్‌లో అత్యధికంగా 63 శాతం మంది, మెదక్‌లో అతి తక్కువగా 20 శాతం మంది పాసయ్యారు. అన్ని గ్రూపుల్లోనూ అత్యధిక మార్కులు ప్రైవేటు సంస్థలకే దక్కాయి. అరకొర విద్యాబోధన సాగిన ప్రభుత్వ కాలేజీలు గరిష్ట మార్కుల్లో ప్రైవేటుతో పోటీ పడలేకపోయాయి.

‘ఏ’ గ్రేడ్‌ ఉత్తీర్ణులే ఎక్కువ
పాసైన విద్యార్థుల్లో 75 శాతానికి పైగా మార్కులను (ఏ గ్రేడ్‌) సాధించినవాళ్లే ఎక్కువున్నారు. మొత్తం 1,15,358 మంది ‘ఏ’ గ్రేడ్‌ సాధించారు. ఎంపీసీ విద్యార్థులు 1,58,139 మంది పరీక్ష రాస్తే 61 శాతం, బైపీసీలో 1,05,585 మంది రాస్తే 55 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీ గ్రూపులో ప్రభుత్వ కాలేజీల్లో గరిష్ట మార్కు 466 కాగా, ప్రైవేటు కాలేజీల్లో 467. బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ గ్రూపుల్లోనూ ఇదే ట్రెండ్‌ కనిపించింది. ఏడాది మొత్తం సంక్షేమ హాస్టళ్లు తెరవకపోవడంతో అక్కడ గరిష్ట మార్కులు ప్రభుత్వ కాలేజీల కన్నా తక్కువగా వచ్చాయి. ఒకేషనల్‌ కోర్సుల్లో ప్రభుత్వ కాలేజీల్లోనే ఉత్తీర్ణత ఎక్కువుంది. మొత్తం 49,331 మంది ఒకేషనల్‌ పరీక్షకు హాజరైతే 24,226 (49 శాతం) మంది ఉతీర్ణలయ్యారు. ఇందులో బాలికలు 62 శాతం ఉన్నారు. 

చప్పుడు లేకుండా..
ఇంటర్‌ బోర్డు మీడియాకు కనీస సమాచారం ఇవ్వకుండా మధ్యాహ్నం 3 గంటలకు గుట్టుచప్పుడు కాకుండా ఫలితాలను వెబ్‌సైట్‌లో పెట్టేసింది. మొదటి సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం గతంతో పోలిస్తే మరీ తక్కువగా ఉండటంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని చడీచప్పుడు లేకుండా ఫలితాలు వెల్లడించింది. ఆన్‌లైన్‌ చదువులు విద్యార్థులకు అర్థం కాకపోవడం, ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులకు సక్రమంగా ఆ సదుపా యం అందుబాటులో లేకపోవడంతో కొన్ని వర్గాలు ఆందోళన చెందినట్టే ఉత్తీర్ణత 49 శాతం దాటలేదు.

అనుక్షణం ఉత్కంఠగానే..
మొదటి ఏడాది ఇంటర్‌ పరీక్షలు ఈ ఏడాది అనుక్షణం ఉత్కంఠగానే సాగాయి. మార్చిలో జరగాల్సిన పరీక్షలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. తొలుత అందరినీ రెండో ఏడాదికి ప్రమోట్‌ చేశారు. థర్డ్‌ వేవ్‌ ఆందోళనలతో ఫస్టియర్‌ పరీక్షలు అనివార్యమని బోర్డు భావించింది. సెప్టెంబర్‌ నుంచి ఇదే టెన్షన్‌. చివరకు అక్టోబర్, నవంబర్‌లో పరీక్షలు జరిగాయి.

రీ వెరిఫికేషన్‌కు 22 వరకు చాన్స్‌
విద్యార్థులు శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌ ద్వారా మార్కులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఐడీ, పాస్‌వర్డ్‌ సంబంధిత కాలేజీలకు పంపినట్టు బోర్డు తెలిపింది. తప్పులుంటే ప్రిన్సిపాల్స్‌ ద్వారా బోర్డుకు ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ కోసం ఈ నెల 22లోగా దరఖాస్తు చేసుకోవాలంది.

మరిన్ని వార్తలు