Telangana: ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు.. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ తేదీల్లో మార్పులు! 

30 Aug, 2022 02:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు మంగళవారం వెల్లడికానున్నా­యి. ఈ మేరకు ఇంటర్‌బోర్డు అధికారులు సోమ­వా­రం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది మేలో ఇంటర్మీడియెట్‌ రెగ్యులర్‌ పరీక్షలు జరిగా­యి. ఈ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు వార్షిక పరీక్షలతో సంబంధం లేకుండా ఎంసెట్‌కు హాజరవుతారు.

అయితే ఇప్పటికే ఎంసెట్‌ ఫలితాలు ప్రకటించి, కౌన్సెలింగ్‌ ప్రక్రియ కూడా మొదలైంది. ఇందులో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు విద్యార్థులు హాజరవ్వాల్సి ఉంటుం­ది. ఇంటర్‌ ఫెయిల్‌ అయి, సప్లిమెంటరీ పరీక్షలు రాసిన 1.13 లక్షల మంది విద్యార్థులు ఫలితా­లు రాకపోవడంతో తొలిదశ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు హాజరవ్వలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో విద్యా­ర్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్‌ బోర్డు అధికారులు నిర్ణయించారు. 

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ తేదీల్లో మార్పులు..? 
ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాల కోసం నిరీక్షిస్తున్న వారికి ఉన్నత విద్యామండలి ఎంసెట్‌కు హాజరయ్యే అవకాశం కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. వాస్తవానికి సెప్టెంబర్‌ 6న ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపు జరగనుంది. ఈ కారణంగా సప్లిమెంటరీ రాసిన విద్యార్థులు తొలిదశ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం కన్పించడం లేదు.

దీన్ని దృష్టిలో ఉంచుకుని రిజిస్ట్రేషన్, ఆప్షన్ల నమోదు తేదీలను పొడిగించాలని నిర్ణయించారు. ఉన్నత విద్యామండలి అధికారులు మంగళవారం సమావేశమైన అధికారిక నిర్ణయం తీసుకునే వీలుంది.   

మరిన్ని వార్తలు