తెలంగాణ: మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌ పోస్టులు ఖాళీ

3 Jun, 2021 10:23 IST|Sakshi

‘గుత్తా, నేతి’ పదవీకాలం నేటితో పూర్తి

 21నెలల పాటు శాసనమండలి చైర్మన్‌ పీఠంపై గుత్తా సుఖేందర్‌రెడ్డి

2015 జూన్‌లో రెండోసారి ఎమ్మెల్సీగా నేతి విద్యాసాగర్‌ ఎన్నిక

డిప్యూటీ చైర్మన్‌గా మరోసారి అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌

కోవిడ్‌ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరపని ఎన్నికల కమిషన్‌

మరోసారి పదవి రెన్యువల్‌పై గుత్తా అనుచరుల ఆశాభావం

సాక్షి, నల్లగొండ : ఒకేసారి జిల్లాకు చెందిన ఇద్దరు నేతల పదవీ కాలం.. ఒకేరోజు పూర్తవుతోంది. తెలంగాణ శాసన మండలి సభ్యులుగా ఎన్నికై  చైర్మన్‌ పదవిని దక్కించుకున్న గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ల పదవీకాలం గురువారంతో పూర్తవుతోంది. వాస్తవానికి మండలిలో ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తవుతుండగా.. జిల్లాకు చెందిన వారే ఇద్దరున్నారు. ఈ స్థా నాలు ఖాళీ అయ్యేలోపే వీటిని భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సి ఉంది. కానీ, కోవిడ్‌–19 విస్తృత వ్యాప్తి కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.  పదవీ కాలం పూర్తి కానున్న చైర్మన్‌ సుఖేందర్‌ రెడ్డి, డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌లో ఎవరికి ³దవి రెన్యువల్‌ అవుతుందన్న చర్చ ఆసక్తి రేపుతోంది. 

చైర్మన్‌గా... 21 నెలలు
నల్లగొండ పార్లమెంట్‌ స్థానం నుంచి మూడు పర్యాయాలు లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన సీనియర్‌ నాయకుడు గుత్తా సుఖేందర్‌ రెడ్డి 2019 ఆగస్టు 26వ తేదీన ఎమ్మెల్యే కోటాలో మండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. రెండు వారాల తేడాతో ఆయన అదే ఏడాది సెప్టెంబర్‌ 11వ తేదీన తెలంగాణ శాసన మండలి రెండో చైర్మన్‌గా పీఠం ఎక్కారు. ఈ పదవిలో ఆయన మొత్తంగా ఒక ఏడాది ఎనిమిది నెలల 23రోజులపాటు ఉన్నారు. ఈ సమయంలో రెండు బడ్జెట్‌ సమావేశాలు, రెండు శీతాకాల సమావేశాలు జరిగాయి. 

ఎమ్మెల్సీ రెన్యువల్‌పై అనుచరుల ఆశాభావం
గుత్తా ఎమ్మెల్సీగా కనీసం నిండా రెండేళ్లు కూడా పదవిలో లేరు. ఆయనకు చైర్మన్‌ పదవి కట్టబెట్టినా.. కేవలం 21 నెలలే కావడంతో.. మరోసారి ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందన్న ఆశాభావం ఆయన అనుచరవర్గంలో వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌ అధినేత్రి, అప్పటి యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేయడంలో రాష్ట్ర కాంగ్రెస్‌ నుంచి తీవ్రమైన ఒత్తిడి తెచ్చిన ఆ పార్టీ ఎంపీలో సుఖేందర్‌ రెడ్డి కూడా ఉన్నారు. ఆ పార్టీ ఎంపీగా పదవీకాలం పూర్తి కాకముందే ఆయన టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు.

ఈ క్రమంలోనే కొద్ది ఆలస్యంగానైనా టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ గుత్తాను మండలిలోకి తీసుకున్నారు. అయితే.. ఎమ్మెల్సీలకు ఉండే ఆరేళ్ల పదవీ కాలంలో గుత్తా కనీసం రెండేళ్లు కూడా ఆ పదవిలో లేని కారణంగా మరోసారి అవకాశం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్‌–19 నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో.. తిరిగి ఎన్నికలు జరిగి.. మరోసారి అవకాశం వచ్చేదాకా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.

నేతి విద్యాసాగర్‌ది కూడా..
డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ 2015 జూన్‌ 4వ తేదీన ఎమ్మెల్సీగా ఎన్నిక కాగా, ఆయన కూడా గురువారం పదవీకాలం పూర్తి చేస్తున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందే ఉమ్మడి రాష్ట్రంలో ఆయన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఉన్నారు. తెలంగాణ శాసన మండలి తొలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్సీగా ఉన్న ఆయన టీఆర్‌ఎస్‌కు సహకరించడంతో స్వామిగౌడ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  ఆ తర్వాత నేతి విద్యాసాగర్‌ పదవీ కాలం పూర్తి కావడంతో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆయనకు మరోసారి అవకాశం కల్పించారు. దీంతో 2015లో టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై, డిప్యూటీ చైర్మన్‌గా తిరిగి పోస్టు దక్కించుకున్నారు.

► గుత్తా సుఖేందర్‌రెడ్డి 2019 ఆగస్టులో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అదే ఏడాది సెప్టెంబరు 11వ తేదీన చైర్మన్‌గా నియమితులై పదవీ బాధ్యతలు స్వీకరించారు. 

► నేతి విద్యాసాగర్‌ 2015 జూన్‌ 4న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అంతకుముందే డిప్యూటీ చైర్మన్‌గా పని చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ మరో సారి ఆయ నకు అవకాశం ఇచ్చారు.

చైర్మన్‌గా సంతృప్తికరం 
తెలంగాణ శాసన మండలి చైర్మన్‌గా పనిచేసింది స్వల్ప కాలమే అయినా.. ఆ 21నెలల్లో నాలుగు సెషన్లను ఎంతో సంతృప్తి కలిగించాయి. రెండుసార్లు బడ్జెట్‌ సమావేశాలు, మరో రెండుసార్లు శీతాకాల సమావేశాలు జరగగా.. మండలి గౌరవాన్ని, ప్రభుత్వ గౌరవాన్ని కాపాడేలా.. సభను నిర్వహించిన అనుభూతి గొప్పది.
– గుత్తా సుఖేందర్‌రెడ్డి, మండలి చైర్మన్‌

గౌరవ ప్రదంగా నడిపించా
పెద్దల సభను గౌరవ ప్రదంగా నడిపించా. 2012నుంచి తొమ్మిదేళ్లపాటు శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా సభ్యులందరి సహకారంతో ముందుకు సాగా. సీఎం కేసీఆర్‌ నాకు ఎమ్మెల్సీగా, డిప్యూటీ చైర్మన్‌గా అవకాశం ఇచ్చారు. ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను.
 – నేతి విద్యాసాగర్, మండలి డిప్యూటీ చైర్మన్‌ 

చదవండి: అయ్యో పాపం; పచ్చని కుటుంబంలో ‘కరోనా’ కల్లోలం

మరిన్ని వార్తలు