కేంద్రం నిర్ణయంతో అగ్గి రాజుకుంది 

19 Jun, 2022 02:07 IST|Sakshi
భారీ సంఖ్యలో వాహనాలతో ర్యాలీగా సభా ప్రాంగణానికి  వస్తున్న ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారధిరెడ్డి  

‘సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞత’ సభలో మంత్రి పువ్వాడ 

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సైనిక నియామకాలను కాంట్రాక్టు పద్ధతిలో చేపట్టాలన్న కేంద్రప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో దేశవ్యాప్తంగా అగ్గి రాజుకుందని, యువత రగిలిపోతున్నా రని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రప్రభు త్వం వెంటనే అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), బండి పార్థసారథిరెడ్డి శనివారం తొలిసారి ఖమ్మం వచ్చారు.

ఈ సందర్భంగా జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెం వద్ద పార్టీ శ్రేణులు వారికి ఘనస్వాగతం పలికి.. ర్యాలీగా ఖమ్మం లోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో సాయంత్రం ఏర్పాటుచేసిన ‘కేసీఆర్‌కు కృతజ్ఞత సభ’కు చేరుకున్నారు. ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్‌ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు అధ్యక్షతన ఏర్పాటుచేసిన సభలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ యువతను మోసం చేస్తున్న కేంద్రంపై సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో పోరాడనున్నట్లు చెప్పారు.

రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ తనకు జన్మనిచ్చిన మహబూబాబాద్‌ జిల్లా ఇనుగుర్తి, పారిశ్రామికంగా ఎదిగేందుకు దోహదం చేసిన ఖమ్మం గడ్డను ఎప్పటికీ మరువబోనని అన్నారు. బండి పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ ఎనిమిదేళ్లలో ముఖ్య మంత్రిగా కేసీఆర్‌ సాధించిన ప్రగతి అద్భుత మని కొనియాడారు. సభలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు తదితరులు మాట్లాడారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు