మరియమ్మ కుమారుడికి ఉద్యోగం, రూ.35 లక్షల చెక్కు

29 Jun, 2021 08:31 IST|Sakshi
మరియమ్మ కుమార్తెలకు చెక్కులు అందజేస్తున్న అజయ్‌కుమార్, నామా, భట్టి   

ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ 

మరియమ్మ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం, ఉద్యోగ నియామక పత్రం అందజేత 

చింతకాని/సాక్షి, హైదరాబాద్‌: మరియమ్మ కుటుంబానికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామంలోని మరియమ్మ ఇంటికి సోమవారం మంత్రి పువ్వాడతో పాటు ఎంపీ నామా నాగేశ్వరరావు, కలెక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్, సీపీ విష్ణు ఎస్‌. వారియర్‌ వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆ తర్వాత సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మరియమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం కేసీఆర్‌ ప్రకటన మేరకు మరియమ్మ కుమార్తెలు స్వప్న, సుజాతకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చెక్కులు, కుమారుడు ఉదయ్‌కిరణ్‌కు రూ.15 లక్షల చెక్కుతో పాటు షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ ఖమ్మం ప్రధాన కార్యాలయంలో ఆఫీస్‌ సబార్డినేట్‌ ఉద్యోగ నియామక పత్రాన్ని మంత్రి పువ్వాడ, భట్టి తదితరులు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ మరియమ్మ ఘటన సీఎం కేసీఆర్‌ దృష్టికి రాగానే, ఆయన స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ. 35 లక్షల ఆర్థిక సహాయం, ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, జెడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.  

అఫిడవిట్‌ వేయండి: హైకోర్టు
రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌ లాకప్‌డెత్‌ ఘటనలో మృతి చెందిన మరియమ్మ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నామని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ హైకోర్టుకు నివేదించారు. అలాగే ఆమె కుమారుడు, కుమార్తెలకు ఆర్థికసాయం అందిస్తున్నామని తెలిపారు. లాకప్‌డెత్‌ ఘటనపై న్యాయ విచారణ చేయించాలని, మృతురాలి కుటుంబానికి రూ.5 కోట్లు ఆర్థికసాయం అందించేలా ఆదేశించాలంటూ పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ (పీయూసీఎల్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయ వింధ్యాల దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లి, జస్టిస్‌ బి.విజయసేన్‌ రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. లాకప్‌డెత్‌ ఘటనపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఏజీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ధర్మాసనం ఆగస్టు 2కు వాయిదా వేసింది.  

చదవండి: ‘మా కళ్లముందే అమ్మను చిత్రహింసలు పెట్టారు.. క్రూరంగా ప్రవర్తించారు’

మరిన్ని వార్తలు