మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు పితృ వియోగం 

15 Feb, 2021 08:07 IST|Sakshi

కల్వకుంట్ల కవిత సహ పలువురు సంతాపం

పాలమూరు/సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు పితృ వియోగం కలిగింది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తండ్రి రిటైర్డ్‌ హెచ్‌ఎం వి.నారాయణగౌడ్‌ (73) హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందారు.  

ప్రముఖుల సంతాపం 
శ్రీనివాస్‌గౌడ్‌ తండ్రి మృతి పట్ల పలువురు మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. నారాయణగౌడ్‌ మరణ వార్త తెలిసిన వెంటనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాష్ట్ర మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు దామోదర్‌రెడ్డి, బాల్కసుమన్‌లు యశోదా ఆస్పత్రికి వెళ్లి నారాయణగౌడ్‌ పార్థివదేహాన్ని సందర్శించారు. మరో మంత్రి మహమూద్‌ అలీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌లు కూడా ఆస్పత్రికి వెళ్లి శ్రీనివాస్‌గౌడ్‌ను పరామర్శించారు.  అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ఫోన్‌ చేసి శ్రీనివాస్‌గౌడ్‌కు ధైర్యం చెప్పారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా ఫోన్‌లో శ్రీనివాస్‌గౌడ్‌ను పరామర్శించారు. మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌లు వేర్వేరు ప్రకటనల్లో నారాయణగౌడ్‌ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. శ్రీనివాస్‌గౌడ్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.    
 

మరిన్ని వార్తలు