నాలాల వెంబడి ఇళ్లలోని పేదలకు డబుల్‌ ఇళ్లు

12 Jun, 2021 14:05 IST|Sakshi

నాలాల సమస్యకు ‘టెక్‌’ చెక్‌

నాలాల పనుల నిర్వహణకు అధునిక టెక్నాలజీ వినియోగం

శాశ్వత పరిష్కారమే ధ్యేయం కావాలి

ఎమ్మెల్యే నుంచి కార్పొరేటర్‌ వరకు వారం పాటు క్షేత్రస్థాయిలోకి

సమీక్ష సమావేశంలో మంత్రి తలసాని

సాక్షి, సిటీబ్యూరో: సిటీలో నాలాలు, వరద ముంపు సమస్యల శాశ్వత పరిష్కారానికి తగిన ప్రణాళిక రూపొందించి, ఎంత ఖర్చవుతుందో అంచనా వేయాల్సిందిగా పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధికారులకు సూచించారు. శుక్రవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నగరంలో నాలాల పరిస్థితులపై అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన  మాట్లాడుతూ, ప్రతియేటా చేస్తున్న పనుల వల్ల శాశ్వత పరిష్కారం లభించక ప్రజాధనం దుబారా అవుతోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అలా కాకుండా నాలాల్లో పూడికతీత పనులకు ఆధునిక టెక్నాలజీ, మెషినరీ ఎక్కడ ఉన్నా వినియోగించేందుకు, వాటి లభ్యతపై అవసరమైతే ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో పర్యటించి అధ్యయనం చేసేందుకు సాంకేతిక నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తద్వారా పూడికతీత పనుల్లో మనుషులను వినియోగించడం కూడా తగ్గుతుందని, తద్వారా వారి ఆరోగ్యానికి రక్షణ కలి్పంచినట్లవుతుందని పేర్కొన్నారు.  

పేదలకు డబుల్‌ ఇళ్లు... 
నాలాలపై నిరి్మంచిన అక్రమ నిర్మాణాల్లో నివసిస్తున్న పేదలను గుర్తించి, వారికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కేటాయింపుతో పునరావాసం కల్పించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని, అందుకు అవసరమైన సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు.  
ఈ సంవత్సరం దాదాపు రూ.45 కోట్లతో నాలాల్లో పూడికతీత పనులు చేపట్టినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో  అక్రమ నిర్మాణాల వల్ల వరద నీటి ప్రవాహానికి అంతరాయాలు ఏర్పడుతున్నాయని  పలువురు అధికారులు సమావేశం దృష్టికి తెచ్చారు.  

కేటీఆర్‌ ఆధ్వర్యంలో ఒక రోజు వర్క్‌షాప్‌ 
నాలాల పూడిక తొలగింపు పనులు, నాలాల నీటి మళ్లింపు, అభివృద్ధి,  చెరువుల పరిరక్షణ తదితర అంశాలపై మునిసిపల్‌ మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో ఒకరోజు వర్క్‌ షాప్‌ జరుగనున్నట్లు తలసాని తెలిపారు. దీనికి సంబంధించి ఈ నెలాఖరులోగా చేపట్టాల్సిన పనులు, అవసరమైన నిధులు తదితర అన్ని అంశాలతో కూడిన సమగ్ర నివేదిక రూపొందించాలని సూచించారు. ప్రజల నుంచి అందే ఫిర్యాదులపై అధికారులు తగిన విధంగా స్పందించాలన్నారు. నగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి మంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ నేతృత్వంలో నిపుణుల కమిటీని వెంటనే నియమించాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌కు సూచించారు.  

క్షేత్రస్థాయిలోకి.. 
ఈ నెల 14వ తేదీ సోమవారం నుంచి వారాంతం వరకు జీహెచ్‌ఎంసీలోని ఇంజినీరింగ్‌ అధికారులంతా స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేటర్‌ వంటి ప్రజాప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించాలని, నాలాలకు సంబంధించిన సమస్యలు పరిశీలించి, పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు.  

పనుల జాప్యంపై  అసంతృప్తి.. 
నాలాలకు సంబంధించిన పనులు జనవరిలోనే జరగాల్సి ఉండగా, మార్చిలో చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారని, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ జరగడం లేవని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక కార్పొరేటర్లను ఈ సమావేశానికి ఆహ్వానించి ఉంటే..  జరగని పనులపై ప్రశ్నలతో సమావేశం జరిగే పరిస్థితి కూడా ఉండదన్నారు.  

దాదాపు 221 కిలోమీటర్లకుగాను 207 కిలోమీటర్లలో దాదాపు 4.5 లక్షల క్యూబిక్‌ మీటర్ల పూడికను తొలగించినట్లు సీఈ దేవానంద్‌ సమావేశంలో పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. జియోట్యాగింగ్‌ ద్వారా పనులు పర్యవేక్షించేందుకు ప్రధాన కార్యాలయంలో మానిటరింగ్‌ సెల్‌ ఉందన్నారు. సమావేశంలో హోమ్‌  మంత్రి  మహమూద్‌ అలీ, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మా, డిప్యూటీ మేయర్‌ మోతే శ్రీలత శోభన్‌ రెడ్డి, ఆయా విభాగాల  ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు