దుర్ఘటన జరిగితే సస్పెన్షన్‌ వేటు 

14 Oct, 2021 08:17 IST|Sakshi

కాంట్రాక్టర్లుసహా బాధ్యులైన సిబ్బందిపై క్రిమినల్‌ కేసులు 

ఇకపై వర్క్‌సైట్లలో రక్షణ చర్యలు తప్పనిసరి 

ప్రమాదాలపై పురపాలక శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ

సాక్షి, హైదరాబాద్‌: పురపాలికల పరిధిలో జరిగే అభివృద్ధి, నిర్వహణ, మరమ్మతు పనుల వర్క్‌సైట్లలో ఇటీవల వరుస దుర్ఘటనలు జరిగి ప్రాణనష్టం సంభవించడం పట్ల రాష్ట్ర పురపాలక శాఖ సీరియస్‌ అయింది. ఏదైనా ఘటన జరిగి ప్రాణనష్టం సంభవించినా, ఎవరైనా గాయాలపాలైనా.. అందుకు కారణమైన క్షేత్రస్థాయి సిబ్బందిని తక్షణమే సస్పెండ్‌ చేయాలని మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించింది. వీరితో సహా సంబంధిత కాంట్రాక్టర్‌/నిర్మాణ సంస్థ అధిపతిపై క్రిమినల్‌ చర్యలు కేసులు పెట్టాలని మున్సిపల్‌ కమిషనర్లను కోరింది. 

హైదరాబాద్‌లో ఇటీవల రాత్రి వేళలో నిబంధనలకు విరుద్ధంగా మ్యాన్‌హోల్స్‌ను శుభ్రం చేస్తూ ఇద్దరు కార్మికులు గల్లంతై మరణించడం.. అభివృద్ధి పనుల కోసం తీసిన గుంతలను పూడ్చకపోవడంతో ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు వాటిలో పడి మృతి చెందడం వంటి ఘటనలు జరిగాయి. క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఈ ఘటనలు జరిగినట్లు పురపాలక శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో వర్క్‌సైట్లలో తీసుకోవాల్సిన రక్షణ చర్యల విషయంలో మార్గదర్శకాలను ప్రకటిస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.  

అంతిమ బాధ్యత కమిషనర్లదే.. : 
పురపాలికలు రోజువారీగా చేపట్టే నీటి సరఫరా, పారిశుద్ధ్యం, డ్రైనేజీ క్లీనింగ్, వీధి దీపాలు వంటి పనులతో పాటు ఫ్లై ఓవర్ల నిర్మాణం వరకు అన్ని రకాల పనుల సైట్లలో పౌరులు/కార్మికులు/ఉద్యోగులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అభివృద్ధి, నిర్వహణ పనులు కాంట్రాక్టర్లు చేస్తున్నా, దీనిని సాకుగా తీసుకుని సిబ్బంది, విభాగాధిపతులు రక్షణ చర్యల పట్ల నిర్లక్ష్యం చేయరాదన్నారు.

పురపాలికల పరిధిలోని వర్క్‌సైట్ల వద్ద అంతిమంగా రక్షణ బాధ్యత మున్సిపల్‌ కమిషనర్లదేనని స్పష్టం చేశారు. తవ్వకాలు జరిపేటప్పుడు కనీసం 1.5 మీటర్ల ఎత్తుతో బారికేడ్లు ఏర్పాటు చేసి వాటికి ఎల్‌ఈడీ లైట్లు బిగించాలని, ప్రజలను అప్రమత్తం చేసేందుకు 100 మీటర్ల దూరంలోనే డేంజర్‌ సూచికల బోర్డులు ఏర్పాటు చేయాలని మార్గదర్శకాల్లో సూచించారు. 

మరిన్ని వార్తలు