సచివాలయ నిర్మాణానికి ముహూర్తం ఖరారు

7 Aug, 2020 00:57 IST|Sakshi

విజయదశమి రోజున కొత్త సచివాలయ నిర్మాణం ప్రారంభం

సెక్రటేరియట్‌కు నాలుగు వైపులా రోడ్లు

పార్లమెంటుకు వాడిన ధోల్‌పూర్‌ ఎరుపు రాతితో బేస్‌మెంట్‌

సాక్షి, హైదరాబాద్‌ : కొత్త సచివాలయ భవనాన్ని ఏడాది కాలంలోనే సిద్ధం చేయాలన్న లక్ష్యంతో వేగంగా పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే దసరా రోజున పనులు ప్రారంభించి తదుపరి దసరా వరకు పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేస్తోంది. దాదాపు 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడంతస్తుల భారీ భవనం, చుట్టూ పచ్చికబయళ్లు, రోడ్లు.. ఇంత పెద్ద ప్రాజెక్టు 12 నెలల్లో పూర్తి చేయటం అంత సులభం కానప్పటికీ, వీలైనంత తొందరలో ప్రధాన భవనాన్ని సిద్ధం చేయాలని ఆదేశించింది. భవన నిర్మాణానికి వీలుగా 4 రకాల విభాగాల నుంచి అనుమతులు పొందాల్సి ఉండటంతో అధికారులు ఆ కసరత్తు ప్రారంభించారు. అనుమతులు వచ్చేలోపు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు.

గుమ్మటం ఎత్తే 111 అడుగులు..
డెక్కన్‌–కాకతీయ శైలిలో రూపుదిద్దుకోబోతున్న తెలంగాణ సచివాలయ భవనం ఎత్తు 278 అడుగులు. ఇందులో మధ్యభాగంలో ఉండే ప్రధాన గుమ్మటం ఎత్తే ఏకంగా 111 అడుగులు కావటం విశేషం. మొత్తం ఏడంతస్తులుగా ఉండే భవనంలో.. ఈ గుమ్మటం ఎత్తు ఇంచుమించు 4 అంతస్తులతో సమానంగా ఉండనుందంటే దాని ఆకృతి ఎంత పెద్దదో ఊహించవచ్చు. ఇక గుమ్మటంపై 11 అడుగుల ఎత్తుతో నాలుగు సింహాలతో కూడిన అశోకముద్ర అలరారనుంది. భవనం పైభాగం మధ్యలో విశాలమైన స్కైలాంజ్‌ నిర్మిస్తున్నారు. ఇది గుమ్మటం దిగువ భాగమన్నమాట. ఈ స్కైలాంజ్‌ 50 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దానిపైన 50 అడుగుల ఎత్తుతో గుమ్మటం పైభాగం ఉంటుంది.

నాలుగువైపులా రోడ్డు..
పాత సచివాలయానికి మూడు వైపులనే రోడ్డు ఉంది. కానీ కొత్త సచివాలయ భవనానికి వెనక వైపు కూడా రోడ్డు నిర్మించనున్నారు. వెరసి నాలుగువైపులా రోడ్డు ఉండబోతోంది. రోడ్డు రూపంలో గతంలో ఎదురైన వాస్తు దోషం.. దీంతో సరిదిద్దినట్టు కానుందని సమాచారం. మింట్‌ భవనం–సచివాలయం మధ్య నుంచి ఇప్పుడు కొత్తగా రోడ్డును నిర్మించనున్నారు. గతంలో జీ బ్లాక్‌ ఉన్న ప్రాంతానికి కాస్త అటుఇటుగా ప్రధాన భవనం నిర్మితం కానుంది. గతంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న సీ బ్లాక్‌ ప్రాంతం కొత్త సచివాలయ ప్రహరీ ఆవలివైపు చేరనుండటం విశేషం. ప్రస్తుతమున్న తెలంగాణ సచివాలయ ప్రవేశద్వారం కనుమరుగు కానుంది. హుస్సేన్‌సాగర్‌ వైపు ఉన్న పాత ప్రవేశద్వారమే ఉండనుంది.

–ప్రవేశద్వారం వద్ద ఉండే పోర్టికో పైన జాతీయపతాక దిమ్మె ఏర్పాటు చేస్తున్నారు. 
–కొత్త సచివాలయ బేస్‌మెట్‌కు రాజస్తాన్‌లోని ధోల్‌పూర్‌లో లభించే ఎర్ర రాతిని వినియోగించనున్నారు. ఢిల్లీలోని పార్లమెంటు భవనాన్ని ఈ రాతితోనే నిర్మించారు.
–ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే ఏడో అంతస్తు కిటికీలు బుల్లెట్‌ ప్రూఫ్‌తో ఉండనున్నాయి. 
–భవనం మొత్తం తెలుపు రంగుతో తళతళలాడనుండగా, కిటికీలు మాత్రం నీలిరంగు అద్దాలతో కొత్త అందాలు ఒలకబోయనున్నాయి. 
–ఇక ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ.450 కోట్లు. 
–మరో ఐదారు రోజుల్లో కూల్చివేత శిథిలాల పూర్తిగా తొలగించనున్నారు. ఆ వెంటనే పర్యావరణ అనుమతులు, అగ్నిమాపక శాఖ, జీహెచ్‌ఎంసీ, ఎయిర్‌పోర్టు అథారిటీల నుంచి అనుమతుల కోసం దరఖాస్తు చేయనున్నారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా