బండి సంజయ్‌కు షాక్‌.. పాదయాత్రకు పోలీసుల బ్రేక్‌!..

23 Aug, 2022 18:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రకు బ్రేక్‌ పడింది. ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలని వరంగల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జనగామ జిల్లాలో పాదయాత్రకు అనుమతి లేదని నోటీసులో పేర్కొన్నారు. పాదయాత్ర పేరిట విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారన్నారని వర్దన్నపేట ఏసీపీ శ్రీనివాస్ రావు వెల్లడించారు. ధర్మదీక్ష పేరుతో వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారని.. రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు.

పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్‌లకు ఏసీపీ నోటీసులు జారీ చేశారు. జాఫర్ ఘడ్ మండలం ఉప్పుగల్‌లో చోటుచేసుకున్న పరిణామాలతో శాంతి భద్రతల దృష్ట్యా నోటీసులు జారీ చేశామని  తెలిపారు. తక్షణమే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. 
చదవండి: అరెస్టుపై బండి సంజయ్‌ సూటి ప్రశ్న.. ఫోన్‌ చేసి ఆరా తీసిన అమిత్‌ షా

మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదని బండి సంజయ్‌, బీజేపీ నాయకులు తేల్చి చెబుతున్నారు. తమ పాదయాత్రను ఎక్కడ అడ్డుకున్నారో.. అక్కడి నుండే మళ్లీ మొదలుపెడతానని సవాల్ చేశారు. కచ్చితంగా భద్రకాళి అమ్మవారి పాదాల చెంత వరకు పాదయాత్ర కొనసాగిస్తానని తెలిపారు. మూడో విడత పాదయాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభ నిర్వహించి తీరుతామని దానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని బండి సంజయ్‌ పేర్కొన్నారు.
చదవండి: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు 14 రోజుల రిమాండ్‌

హైకోర్టుకు బీజేపీ
ఇక బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రపై బీజేపీ న్యాయ పోరాటానికి దిగింది. పాదయాత్రను నిలిపి వేయాలని పోలీసులు జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ తరుపున హైకోర్టులో హౌజ్ మోషన్ పిటీషన్ దాఖలు అయ్యింది. బీజేపీ హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.దీంతో రేపు మరోసారి పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. కాగా ఓవైపు పోలీసుల నోటీసులు మరోవైపు బీజేపీ నేతల ప్రకటనలతో బండి సంజయ్‌ యాత్ర ముందుకు సాగుతుందా? లేక బ్రేక్‌ పడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

>
మరిన్ని వార్తలు