సీపీఆర్‌ చేసి ప్రాణం కాపాడిన పోలీసు.. మంత్రి హరీష్‌ అభినందన

30 Aug, 2023 18:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విశ్వనగరంలో ట్రాఫిక్‌ పోలీసు అంటే సవాళ్లతో కూడిన ఉద్యోగం. రణగొణ ధ్వనుల మధ్య దూసుకొస్తున్న వాహనాలు, ప్రతికూలంగా ఉండే వాతావరణం, తీవ్ర కాలుష్యం. ఎన్ని అననుకూల పరిస్థితులు ఉన్నా.. డ్యూటీ చేయాల్సిందే. అడ్డదిడ్డంగా వచ్చే వాహనాలను నియంత్రించాల్సిందే. ఇవన్నీ రోజూ జరిగేవే కానీ.. ఈరోజు హైదరాబాద్‌లో జరిగిన ఓ ఘటన.. పోలీసుల్లో డ్యూటీతో పాటు మానవత్వం ఉందన్న విషయాన్ని మరోసారి గుర్తు చేసింది.

బేగంపేటలోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ ముందు అడిషనల్‌ కమిషనర్‌ మధుసూధన్‌ రెడ్డి నేతృత్వంలో విధులు నిర్వర్తిస్తున్నారు పోలీసులు. అదే సమయంలో ఆ రోడ్డులో నడుస్తూ వెళ్తోన్న గుజ్జల రాముకు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శ్రీకాకుళం జిల్లా కండిసా గ్రామానికి చెందిన 40 ఏళ్ల గుజ్జల రాము హైదరాబాద్‌లో తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. బేగంపేటలో నడుస్తూ వెళ్తుండగా తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. 

సీపీఆర్‌తో నిలిచిన ప్రాణం..
గుజ్జల రామును గమనించిన పోలీసులు వెంటనే స్పందించారు. పబ్లిక్‌ స్కూల్‌ పక్కన చెట్టు నీడలోకి తరలించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న అడిషనల్‌ కమిషనర్‌ మధుసూధన్‌ రెడ్డి రామును గమనించాడు. వెంటనే ఇన్‌స్పెక్టర్‌ బాలయోగి, మరో అధికారి శ్రీనివాస్‌తో కలిసి సీపీఆర్‌ చేశారు. అడిషనల్‌ కమిషనర్‌ మధుసూధన్‌ రెడ్డి .. ఆగకుండా సీపీఆర్‌ చేయడంతో రాములో కదలిక వచ్చింది. కాసేపటికి స్పృహలోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరింత మెరుగైన చికిత్సకు రామును గాంధీ ఆస్పత్రికి తరలించారు.

విధుల్లో ఉన్న పోలీసులు సత్వరం స్పందించడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడగలిగారని అక్కడ ఉన్నవారంతా ప్రశంసించారు. అడిషనల్‌ కమిషనర్‌ మధుసూధన్‌ రెడ్డి చేసిన సీపీఆర్‌, దాని వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు నిలపడంపై వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్ రావు ట్విట్టర్‌ వేదికగా అభినందించారు.

ఇది కూడా చదవండి: హృదయవిదారకం: గుండెపోటుతో అన్న మృతి.. కడసారి రాఖీ కట్టిన సోదరి

మరిన్ని వార్తలు