టెట్‌ పాస్‌.. మరి టీచర్‌ కొలువెప్పుడో!

29 Aug, 2022 01:14 IST|Sakshi

పోస్టుల భర్తీ కోసం వేలాదిమంది ఎదురుచూపులు

ప్రైవేటు స్కూళ్లలో కొలువులు మానేసి కోచింగ్‌బాట 

నోటిఫికేషన్‌ కోసం నిరీక్షణ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టీఎస్‌ టెట్‌)లో ఉత్తీర్ణులైన వేలాదిమంది టీచర్‌ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్‌ జారీ చేస్తుందంటూ ఆసక్తిగా వాకబు చేస్తున్నారు. 2016 నుంచి టెట్‌లో అర్హత సాధించిన అనేకమంది టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ప్రభుత్వం వరుసగా ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు ఇస్తున్న నేపథ్యం, టెట్‌ విధానాల్లో మార్పులు తేవడం, భారీగా ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను ప్రభుత్వం ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తాయి.  

ఉద్యోగాలు మానేసి:చాలామంది బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తి చేసిన వెంటనే ప్రైవేటు స్కూళ్లల్లో టీచర్లుగా పనిచేస్తున్నారు. వీళ్లంతా గత జూన్‌లో జరిగిన టెట్‌ పరీక్షకు హాజరయ్యారు. గతానికి భిన్నం­గా ఈసారి 6 లక్షలమంది వరకూ టెట్‌ రాశా­రు. 1–5 తరగతులు బోధించేందుకు డీఎడ్‌ అర్హతతో టెట్‌ పేపర్‌–1 రాస్తారు. గతంలో ఈ పరీక్ష రాయ­డానికి బీఈడీ అభ్యర్థులు అర్హులుకారు. కానీ, ఈసారి టెట్‌లో బీఈడీ అభ్యర్థులు పేపర్‌–2తోపాటు పేపర్‌–1 రాసే వీలు కల్పించారు. ప్రాథమిక పాఠశాలల్లో దాదాపు 7 వేల పోస్టులు ఖాళీగా ఉండటంతో బీఈడీ అభ్యర్థులు కూడా పేపర్‌–1 రాసి పోటీపడుతున్నారు.  

ఈ ఏడాది నియామకాలు ఉండేనా? 
రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో దాదాపు 19 వేల పోస్టులున్నట్టు ప్రభుత్వం లెక్కతేల్చింది. 12 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేస్తామని తెలిపింది. అయితే, బదిలీలు, పదోన్నతులు కల్పిస్తే తప్ప వాస్తవ ఖాళీల లెక్క తెలియదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ఈ ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. దీంతో కొత్త నియామకాలు చేపట్టే అవకాశం లభించడంలేదని ఉపాధ్యాయవర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

ఈ ఏడాది నుంచి ఇంగ్లిష్‌ మీడియం విద్యను ప్రవేశపెట్టడంతో పెద్దఎత్తున ఉపాధ్యాయ నియామకాలు చేపడతారని టెట్‌ అర్హత పొందినవారు ఆశించారు. ఈ నేపథ్యంలో వాస్తవ ఖాళీలు తెలియకుండా కొత్త ఉపాధ్యాయులను నియమిస్తారా? టెట్‌ అర్హులకు అవకాశాలు లభిస్తాయా.. అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. 

ఉద్యోగం మానేసి శిక్షణ
ఈ ఏడాది టెట్‌లో అర్హత సాధించాను. ప్రైవేటు స్కూల్‌ టీచర్‌ ఉద్యోగం మానేసి ప్రభుత్వ టీచర్‌ నియామకం కోసం శిక్షణ తీసుకుంటున్నాను. కానీ, ఎప్పుడు నోటిఫికేషన్‌ వస్తుందో తెలియడం లేదు. 
– ప్రవీణ్, టెట్‌ ఉత్తీర్ణుడు, హైదరాబాద్‌ 

కరోనాతో రోడ్డెక్కా..టెట్‌తో ఆశలు 
బీఈడీ చేసిన తర్వాత ఓ ప్రైవేటు స్కూల్లో టీచ­ర్‌గా పనిచేస్తున్నా. కోవిడ్‌ మూలంగా రెండేళ్ల నుంచి సరిగా జీతాలు ఇవ్వడంలేదు. ఊళ్ళో పొలం పనులకు వెళ్తున్నా. కానీ, టెట్‌ రావడం, ఉపాధ్యాయ నియామకాలు చేపడతా­రనే ఆశ రేకెత్తడంతో కోచింగ్‌ తీసుకుంటున్నాను.  
– ఆర్‌.జీవన్‌కుమార్, టెట్‌ అర్హుడు, వరంగల్‌  

మరిన్ని వార్తలు