TSRTC-Sajjanar: ఆర్టీసీ ఉద్యోగులకు 1నే జీతాలు!

4 Sep, 2021 02:33 IST|Sakshi
సజ్జనార్‌ను అభినందిస్తున్న రవాణా శాఖ మంత్రి అజయ్‌ 

సంస్థ ఆర్థికస్థితిని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తా 

కొత్త ఎండీ వీసీ సజ్జనార్‌ భరోసా 

వీలైనంత త్వరలో స్వయం సమృద్ధి సాధించేలా కృషి 

ఆదాయం పెంపునకు శాస్త్రీయ అధ్యయనం మేరకు చర్యలు  

బస్‌భవన్‌లో బాధ్యతల స్వీకరణ 

సాక్షి, హైదరాబాద్‌: ఇక నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తారీఖునే జీతాలు అందేలా సంస్థ ఆర్థిక స్థితిని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తానని ఆర్టీసీ కొత్త ఎండీ వీసీ సజ్జనార్‌ భరోసా ఇచ్చారు. ప్రస్తుతం సంస్థ ఆర్థిక పరిస్థితి సరిగా లేక రాష్ట్ర ప్రభుత్వ సాయంపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు. వీలైనంత త్వరలో ప్రభుత్వంపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా స్వయం సమృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఆర్టీసీకి ఎండీగా నియమితులైన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సజ్జనార్, బస్‌భవన్‌లోని తన చాంబర్‌లో శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. తర్వాత ఖైరతాబాద్‌లోని ట్రాన్స్‌పోర్టు భవన్‌లో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. బస్‌భవన్‌కు తిరిగొచ్చి మీడియాతో మాట్లాడారు.  

డీజిల్‌ ధరల పెరుగుదలతో పెనుభారం 
‘గత రెండేళ్ల కాలంలో లీటరు డీజిల్‌పై రూ.22 పెరుగుదల నమోదైంది. ఇది ఆర్టీసీపై పెనుభారాన్ని మోపింది. అలాగే బస్సులకు వాడే విడిభాగాల ధరలు కూడా పెరిగాయి. రోజువారీ ఆదాయ వ్యయాల్లో రూ.8 కోట్ల వ్యత్యాసం కనిపిస్తోంది. దీన్ని వెంటనే సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇది జరగాలంటే సంస్థ ఆదాయం పెరగాలి. అది టికెట్‌ ద్వారా సాధించాలా, లేదా కార్గో విభాగం లాంటి ప్రత్యామ్నాయాల ద్వారా పొందాలా అన్నది ఆలోచిస్తాం. ఆర్టీసీ ఆదాయం ఎలా పెంచుకోవాలన్న దానిపై శాస్త్రీయ అధ్యయనం జరిపేందుకు ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ అధ్యయనంలో తేలిన అంశాల ఆధారంగా చర్యలు తీసుకుంటాం’అని సజ్జనార్‌ తెలిపారు.  

మూడు లక్ష్యాలు సాధించేలా.. 
‘ప్రజలు ఆర్టీసీ బస్సులను ఆదరించి దాని ఆదా యం పెరిగేందుకు సహకరించాలి. సురక్షితమైన ప్రయాణం చేయాలి. స్వయం సమృద్ధి సాధించ టం, ప్రయాణికులు సంతృప్తి చెందేలా సేవలందించటం, ఉద్యోగుల సంక్షేమం.. ఈ మూడు లక్ష్యాలు సాధించేలా పని ప్రారంభిస్తున్నాం. ఆర్టీసీని సంస్కరించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో మాజీ అధికారులతో కూడా మాట్లాడుతున్నాం. వారి సూచనలు కూడా పరిగణనలోకి తీసుకుంటాం..’అని చెప్పారు.  

సంక్షేమ మండళ్ల వైపే మొగ్గు 
గతంలో ఆర్టీసీ సమ్మె సమయంలో కార్మిక సంఘాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రెండేళ్లపాటు వాటిని దూరం పెట్టిన విషయం తెలిసిందే. రెండేళ్లు గడిచినా మళ్లీ కార్మిక సంఘాలను గుర్తించలేదు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల దిశగా చర్యలు తీసుకోలేదు. కార్మిక సంఘాలకు ఉద్యోగులు దూరంగా ఉండేలా చూస్తోంది. అందులో భా గంగా డిపో స్థాయిలో ఉద్యోగులకు సంక్షేమ మండళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సజ్జనార్‌ కూడా సంక్షేమ మండళ్లవైపే మొగ్గు చూపు తున్నారు.

కార్మిక సంఘాల గురించి ప్రశ్నించగా, ప్రస్తుతం డిపోల్లో సంక్షేమ మండళ్లు అందుబాటులో ఉన్నందున వాటితోనే కార్మికుల సంక్షేమంపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే బస్సుల వివరాలు ప్రయాణికులకు తెలిసేలా జీపీఎస్‌ ఆధారిత ఆధునిక సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. 

ఎర్ర తివాచీ స్వాగతం 
సజ్జనార్‌కు అధికారులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. బస్‌భవన్‌ ప్రాంగణమంతా ఆయన మినీ కటౌట్‌లు, పూల అలంకరణలతో ముస్తాబు చేశారు. ప్రధాన ద్వారం నుంచి లోపలివరకు ఎర్ర తివాచీ పరిచి దాని మీదుగా నడిచివచ్చేలా ఏర్పాటు చేశారు. దారికి రెండువైపులా ఉద్యోగులు నిలబడి పూలను చల్లుతూ ఆహ్వానం పలికారు. కాగా అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో సజ్జనార్‌ విడివిడిగా భేటీ అయ్యారు. ఉదయం నుంచి రాత్రి వరకు బస్‌భవన్‌లోనే గడిపిన ఆయన.. రాత్రి తన కార్యాలయానికి వచ్చిన కుటుంబసభ్యులను అధికారులకు పరిచయం చేశారు.  

>
మరిన్ని వార్తలు