మా లెక్కే కరెక్ట్‌.. ఇక మీ ఇష్టం 

21 Sep, 2022 00:43 IST|Sakshi

ఫీజుల ఖరారుపై తేలని తకరారు

ఇంజనీరింగ్‌ కాలేజీల ఆడిట్‌ రిపోర్టులను మళ్లీ పరిశీలిస్తున్న ఎఫ్‌ఆర్‌సీ

ఖర్చులన్నీ న్యాయబద్ధమైనవేనని అంటున్న యాజమాన్యాలు 

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల ఆడిట్‌ రిపోర్టుల పరిశీలన కార్యక్రమం మంగళవారం కూడా కొన సాగింది. ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఎస్‌ఎఫ్‌ ఆర్‌సీ) కార్యాలయంలో దాదాపు 29 కాలేజీల ప్రతినిధులు హాజరయ్యారు. ఒక్కోకాలేజీ ప్రతినిధితో అధికారులు విడి విడిగా చర్చలు జరిపారు. జమాఖర్చుల వివరాలపై మరింత లోతుగా ప్రశ్నలు వేశారు.

ఎఫ్‌ఆర్‌సీ వర్గాలు మాత్రం కాలేజీలు సమర్పించిన నివేదికల్లోని ప్రతీ అంశాన్ని నిశితంగా పరిశీలించాయి. యాజమాన్య ప్రతిని ధులు మాత్రం తమ ఖర్చులన్నీ న్యాయబద్ధమైనవేనని కమిటీ ఎదుట స్పష్టం చేసినట్టు తెలిసింది. ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కొత్త ఫీజుల ఖరారుపై కొంతకాలంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.

కోవిడ్‌ నేపథ్యంలో 2019లో ఖరారు చేసిన ఫీజులే కొనసాగించాలని ఎఫ్‌ఆర్‌సీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీంతో 80కిపైగా కాలేజీల యజమా న్యాలు ఎఫ్‌ఆర్‌సీ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్‌ చేశాయి. ఈ నేపథ్యంలో కాలేజీలు ప్రతిపాదించిన ఫీజులనే కొనసాగించేందుకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తుదిఫీజు ఖరారు బాధ్యతను ఎఫ్‌ఆర్‌సీకి అప్పగించడంతో ఆడిట్‌ రిపోర్టుల పునఃపరిశీలన చేపట్టారు.

అప్పుడు ఎందుకు ఆమోదించారు?
కొన్నినెలల క్రితం ఇవే ఆడిట్‌ రిపోర్టులను ఎఫ్‌ఆర్‌సీ ఆమో దించిందని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. కోర్టు వ్యాజ్యాలు, రవాణా చార్జీలు వంటివి తీసేసి, మిగతా ఖర్చులన్నీ న్యాయమైనవేనని ఎఫ్‌ఆర్‌సీ సమ్మతించినట్టు చెబుతున్నాయి. ఇప్పుడు అవే రిపోర్టులపై పరిశీలన చేపట్టడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నాయి. ఈసారి భిన్నమైన రీతిలో ప్రశ్నలు వేస్తున్నారని అంటున్నాయి.

కాలేజీ ప్రాంగణంలో చేసిన రిపేర్లు, లేబొరేటరీల్లో అదనంగా ఏర్పాటు చేసిన వసతులపై కొన్ని కాలేజీలను గుచ్చిగుచ్చి ప్రశ్నించినట్టు తెలిసింది. మూడేళ్లలోనే రిపేర్లు ఎందుకు వచ్చాయి? ఈ వ్యయాన్ని ఆడిట్‌ రిపోర్టులో ఎందుకు చూపించారు? అని ఎఫ్‌ఆర్‌సీ నిలదీసినట్టు సమాచా రం. కాలేజీ ప్రాంగణంలో శుభ్రత కోసం చేపట్టిన ఖర్చును కూడా ప్రశ్నించినట్టు సమాచారం. ఆన్‌లైన్‌ విద్యాబోధనకు ఉపయోగించిన విధానాలు, అయిన ఖర్చులపై మరింత నిశితంగా పరిశీలించేందుకు ఎఫ్‌ఆర్‌సీ ఆసక్తి చూపినట్టు తెలిసింది.

ఫీజు ఎంతో మేమే నిర్ణయిస్తాం..
ఆడిట్‌ రిపోర్టులు పరిశీలించిన తర్వాత కాలేజీ నిర్వాహకులతో అధికారులు ఏ విషయమూ చర్చించడం లేదు. గతంలో ఎంత ఫీజు ఇవ్వాలనుకునేది తమతో చర్చించి అంగీకారం కూడా తీసుకున్నాయని చెబుతు న్నాయి. మరోవైపు ఫీజు పెంచాలా? వద్దా? ఎంత పెంచాలి? అనే విషయాలను తర్వాత తెలియజేస్తామని అధికారులు అంటున్నారు.

ఫీజు నిర్ణయంపై తమకు పూర్తి స్వేచ్ఛ ఉందని ఎఫ్‌ఆర్‌సీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీన్నిబట్టి ఎక్కడో ఒకచోట అవసరమైన మేర నిర్వహణ వ్యయంలో కోత పెట్టే అవకాశం కన్పిస్తోంది. మొత్తం మీద వీలైనంత మేర ఫీజులు తగ్గించాలనే యోచనలో ఉన్నట్టు ఎఫ్‌ఆర్‌సీ వర్గాలు తెలిపాయి.   

మరిన్ని వార్తలు