ఎస్‌ఐ అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు 7న 

5 Jul, 2022 03:20 IST|Sakshi

అదే నెల 21న కానిస్టేబుల్‌ అభ్యర్థులకు కూడా..

పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసిన రిక్రూట్‌మెంట్‌ బోర్డు

సాక్షి, హైదరాబాద్‌: పోలీసు సబ్‌ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్‌ పోస్టులకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. పోలీస్‌ ఉద్యోగాల నియామక ప్రక్రియలో భాగంగా ఆగస్టు 7వ తేదీన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సివిల్‌ విభాగం తదితర సమానహోదా పోస్టులకు, ఆగస్టు 21న కానిస్టేబుల్‌ సివిల్, తదితర సమాన పోస్టులు, ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్‌ పోస్టులకు ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించనున్నట్టు రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

554 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తదితర పోస్టులతోపాటు 15,644 సివిల్‌ తదితర సమాన కానిస్టేబుల్‌ పోస్టులు, 63 ట్రాన్స్‌పోర్టు, 614 ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు మొదటిదశలో భాగంగా రాతపరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు సంబంధించి ఆగస్టు 7న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 20 పట్టణాల్లో రాతపరీక్ష నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.

కానిస్టేబుల్‌ పోస్టులకు సంబంధించి ఆగస్టు 21న ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 40 పట్టణాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 2.45 లక్షల మంది అభ్యర్థులు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ప్రిలిమినరీ, 6.5 లక్షల మంది కానిస్టేబుల్‌ అభ్యర్థులు రాత పరీక్షలకు హాజరవుతారని శ్రీనివాసరావు వెల్లడించారు. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అభ్యర్థులు ఈ నెల 30వ తేదీ నుంచి, కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఆగస్టు 10వ తేదీ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.   

మరిన్ని వార్తలు