పరుగుకు వేళాయెరా! పోలీసు అభ్యర్థులకు త్వరలో తీపి కబురు!

1 Nov, 2022 02:11 IST|Sakshi

పోలీసు భౌతిక పరీక్షలకు రిక్రూట్‌మెంట్‌ బోర్డు సిద్ధం!

నవంబరు 25 నాటికి మైదానాలను సిద్ధం చేయాలని ఆదేశాలు

ఆ తరువాత ఎప్పుడైనా నిర్వహణకు యోచనలో బోర్డు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: శారీరక పరీక్షలు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న పోలీసు అభ్యర్థులకు త్వరలో తీపి కబురు అందనుంది. పార్ట్‌–2 శారీరక పరీక్షలకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఏర్పాట్లు ముమ్మరం చేసింది. నవంబరు 25 నాటికి రాష్ట్రంలో వివిధ కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాల పరిధిలో ఉన్న మైదానాలను శారీరక పరీక్షల కోసం సిద్ధం చేయాలని పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్‌ కమిషనర్లను, మహబూబ్‌నగర్, నల్లగొండ, సంగారెడ్డితోపాటు ఆదిలాబాద్‌ ఎస్పీలను అప్రమత్తం చేసింది. గతంలో 2018లో నిర్వహించిన తరహాలోనే ఈసారి కూడా అవే మైదానాల్లో నిర్వహించేందుకు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఆసక్తి చూపిస్తోంది.

దాదాపు మూడు లక్షల మంది కోసం..!
ఈ ఏడాది 16,614 పోలీసు కొలువుల భర్తీ ప్రక్రియను టీఎస్‌ఎల్‌ పీఆర్‌బీ చేపట్టింది. ఇందులో ఎస్సై/తత్సమాన పోస్టులు 587, కానిస్టేబుల్‌ పోస్టులు 16,027 ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు 2,25,668 మంది హాజరవగా, 1,05,603 మంది అర్హత సాధించారు. ఆగస్టు 28న నిర్వహించిన కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షకు 6,03,851 మంది పరీక్ష రాయగా.. 1,90,589 మంది అర్హత సాధించారు.

ప్రస్తుతం ఎస్సై, కానిస్టేబుళ్లకు కలిపి 2.96 లక్షల మందికిపైగా అభ్యర్థులు పార్ట్‌–2 కోసం సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం అక్టోబరు 27 నుంచి నవంబరు 10 వరకు పార్ట్‌–2 ఈవెంట్ల కోసం టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకునే పనిలో ఉన్నారు. వీరికి శారీరక పరీక్షలు నిర్వహించే చోట సిబ్బందితోపాటు మౌలిక సదుపాయాలు, ప్రతీ మైదానంలో 50 ఎంబీపీఎస్‌ సదుపాయంతో ఇంటర్నెట్‌ వైఫై సదుపాయం కల్పించే పరికరాలను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలనీ, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు కూడా సిద్ధం చేసుకోవాలని బోర్డు స్పష్టం చేసింది.

నవంబరు 25 తరువాతే..
ప్రస్తుతం ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులంతా పార్ట్‌–2 శారీరక పరీక్షల్లో శ్రమించేందుకు సాధన ముమ్మరం చేశారు. నవంబరు 25 వరకు మైదానాలు సిద్ధం చేసి, తమకు సమాచారం అందించాలన్న పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఆదేశాలను గమనిస్తే.. ఆ తరువాత ఎప్పుడైనా శారీరక పరీక్షలు నిర్వహించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.  

మరిన్ని వార్తలు