విద్యుత్‌ కనెక్షన్‌పై ఏసీడీ.. ఇంటి యజమానే చెల్లించాలి 

17 Jan, 2023 02:17 IST|Sakshi

విద్యుత్‌ ఏసీడీపై టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ చైర్మన్‌

హన్మకొండ: ఇంటి యజమానులు విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకున్న సమయంలో తక్కువ లోడ్‌తో కనెక్షన్‌ తీసుకుంటారని, ఆనంతరం అవసరాలు పెరగడంతో లోడ్‌ పెరుగుతుందని, పెరిగిన లోడ్‌పై రెండు నెలల డిపాజిట్‌ను ఏసీడీ (అదనపు వినియోగ డిపాజిట్‌) రూపంలో విధిస్తున్నట్లు టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అన్నమనేని గోపాల్‌ రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ డిపాజిట్‌కు విద్యుత్‌ సంస్థ ఏడాదికి ఒకసారి వడ్డీ చెల్లిస్తుందన్నారు. డిపాజిట్‌ రూపంలో ఉంటున్నందున, దీనిని కిరాయిదారుడు కాకుండా ఇంటి యాజమాని చెల్లించడం సబబుగా ఉంటుందన్నారు. ఇంటి యజమానికి విద్యుత్‌ అవసరం తీరి కనెక్షన్‌ తొలగించుకునే సమయంలో సెక్యూరిటీ డిపాజిట్‌ మొత్తాన్ని తిరిగి చెల్లించనున్నట్లు తెలిపారు. చాలామంది వినియోగదారులు ఏసీడీని కిరాయిదారుడు చెల్లించాలా? లేదా ఇంటి యజమాని చెల్లించాలా? అని సందేహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈమేరకు స్పష్టంచేశారు. వినియోగదారులకు ఇంకా సందేహాలుంటే విద్యుత్‌ రెవెన్యూ కార్యాలయం, బిల్లులు చెల్లించే కౌంటర్‌ వద్ద నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. 

మరిన్ని వార్తలు