పరీక్షా లీకేజీ కేసు: వదంతులను నమ్మొద్దు.. పరీక్ష రద్దుపై టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ కీలక ప్రకటన

14 Mar, 2023 19:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్‌సీ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌, అవకతవకలు జరిగే అవకాశమే లేదని.. వదంతులను ఆపేందుకే తాము మీడియా ముందుకు వచ్చినట్లు టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌ జనార్థన్‌రెడ్డి తెలిపారు. ఏఈ పరీక్షా ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం.. ఈ నేపథ్యంలో మిగతా పేపర్లూ లీక్‌ అయ్యాయంటూ సభ్యుల ఆందోళన.. తదనంతర పరిణామాల నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం కమిషన్‌ కీలక భేటీ నిర్వహించింది.

సుమారు 4 గంటలకు పైగా ఈ భేటీ జరగ్గా.. కమిషన్‌ సభ్యులు విడిగానే కాకుండా సీఎస్‌ శాంతకుమారితోనూ భేటీ అయ్యారు గమనార్హం. అనంతరం పేపర్‌ లీకేజీ వ్యవహారంపై చైర్మన్‌ మీడియాతో మాట్లాడారు. 

‘‘టీఎస్‌పీఎస్‌సీ పరిధిలోని 30 లక్షల మంది వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ కింద దరఖాస్తు చేసుకున్నారు. 26 రకాల ఉద్యోగులకు నోటిఫికేషన్‌ జారీ చేశాం. గ్రూప్‌-1 పరీక్షలకు మల్టీపుల్‌ జంబ్లింగ్‌ చేశాం’’ అని ఆయన వివరించారు. పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ జరిగే అవకాశం లేదన్న చైర్మన్‌.. దురదృష్టకర పరిస్థితుల్లో ప్రెస్‌ మీట్‌ పెట్టాల్సి వచ్చిందని, పేపర్‌లు లీక్‌ అయ్యాయంటూ, ఎగ్జామ్‌లు రద్దు అవుతాయంటూ వస్తున్న వదంతులకు పుల్‌స్టాప్‌ పెట్టాలని తాము ఇదంతా చెప్తున్నామని ఆయన అన్నారు. 

లీకేజీ సమాచారం అందగానే తాము పోలీసులను ఫిర్యాదు చేశామని, ఆ తర్వాతి పరిణామాలు అందరికీ తెలిసినవే అని చెప్పారాయన. రాజశేఖర్‌రెడ్డి అనే నెట్‌వర్క్‌ ఎక్స్‌పర్ట్‌ ఆరేడు ఏళ్ల నుంచి పని చేస్తున్నారు. నెట్‌వర్క్‌ ఎక్స్‌పర్ట్‌ కావడంతో ఐపీ అడ్రస్‌లు తెలిసే అవకాశం ఉంటుంది. రాజశేఖర్‌రెడ్డితో పాటు అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌ హ్యాకింగ్‌కు పాల్పడ్డాడని, ఈ ఇద్దరితో పాటు మరికొందరి వల్ల ఈ లీక్‌ వ్యవహారమంతా నడిచిందని తెలిపారాయన.

పేపర్‌ లీక్‌ అయిన ఏఈ పరీక్షకు సంబంధించి అధికారిక నివేదిక(బుధవారం మధ్యాహ్నం కల్లా అందే అవకాశం ఉంది).. ఆపై న్యాయ నిపుణుల సలహా తీసుకున్నాకే పరీక్ష వాయిదా వేయాలా? లేదా ఇతర నిర్ణయం తీసుకుని ప్రకటన చేద్దామని భావించామని తెలిపారాయన. అయితే.. ఈలోపు సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్న అనుమానాలను నివృత్తి చేయడానికే మీడియా ముందుకు వచ్చినట్లు తెలిపారాయన. తన కూతురు కూడా గ్రూప్‌-1 రాసిందంటూ ప్రచారం జరుగుతోందన్న విషయాన్ని చైర్మన్‌ జనార్ధన్‌రెడ్డి తోసిపుచ్చారాయన. తన కుటుంబ సభ్యులెవరూ పరీక్ష రాయలేదని స్పష్టత ఇచ్చారు.

ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కు గ్రూప్‌-1 ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో 103 మార్కులు వచ్చిన వ్యవహారంపై స్పందించిన చైర్మన్‌.. అది నిజమేనని, కానీ, ప్రవీణ్‌ సెలక్ట్‌ కాలేదని, ప్రవీణ్‌కు వచ్చిన మార్కులే హయ్యెస్ట్‌ అంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని స్పష్టత ఇచ్చారు.

మరిన్ని వార్తలు