గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ విడుదల

27 Apr, 2022 07:39 IST|Sakshi

వివిధ శాఖల్లో మొత్తం 503 పోస్టుల భర్తీ 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా మంగళవారం గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్‌ జారీ చేసింది. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి.. కార్యదర్శి అనితారామచంద్రన్, కమిషన్‌ సభ్యులతో కలిసి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఉద్యోగాల భర్తీలో ఉన్నత శ్రేణి ఉద్యోగాలంటే గ్రూప్‌–1 ఉద్యోగాలే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ శాఖల్లో 503 పోస్టులను భర్తీ చేయనున్నారు. సోమవారం 16 వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువడగా...తాజాగా గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ విడుదల కావడంతో నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.  

పావువంతు ఎంపీడీఓ పోస్టులే.. 
టీఎస్‌పీఎస్సీ తాజాగా విడుదల చేసిన గ్రూప్‌–1 నోటిఫికేషన్‌లో 503 పోస్టులలో దాదాపు పావు వంతు అంటే 121 పోస్టులు మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి కొలువులే. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రకియలో భాగంగా కొత్త మండలాలు ఏర్పాటు కావడంతో ఎంపీడీఓ పోస్టుల సంఖ్య పెరిగింది. ఆ తర్వాత స్థానంలో వరుసగా  డీఎస్పీ (91) సీటీవో (48), డిప్యూటీ కలెక్టర్‌ (42), మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–2 (41), అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ (40), అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ (38) పోస్టులున్నాయి.

రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఈ పోస్టుల్లో 95 శాతం స్థానిక అభ్యర్థులతోనే భర్తీ చేయనున్నారు. యూనిఫాం ఉద్యోగాల కనిష్ట, గరిష్ట వయోపరిమితి 21 సంవత్సరాల నుంచి 31 సంవత్సరాలుగా, ఇతర ఉద్యోగాల వయోపరిమితి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలుగా నిర్దేశించారు. 

ఓటీఆర్‌ చేసుకున్న అభ్యర్థులు మాత్రమే.. 
ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ మే 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆన్‌లైన్‌ పద్ధతిలో మే 31వ తేదీ వరకు స్వీకరిస్తారు. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీఆర్‌) చేసుకున్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. గ్రూప్‌–1 ఉద్యోగాలను రెండు అంచెల్లో భర్తీ చేస్తారు. ఇంటర్వ్యూలను తొలగించడంతో ఈ మేరకు పరీక్ష విధానంలో మార్పులు చేశారు. ప్రిలిమ్స్‌ (ఆబ్జెక్టివ్‌ టైప్‌), మెయిన్స్‌ (రాత పరీక్ష) ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ప్రిలిమ్స్‌ను జూలై/ఆగస్టులో నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లో వెల్లడించింది. అదేవిధంగా మెయిన్స్‌ పరీక్షలను నవంబర్‌/డిసెంబర్‌లో నిర్వహించనున్నట్లు తెలిపింది. 

తొలిసారిగా ఉర్దూలో.. ఈడబ్ల్యూఎస్‌ కోటా కూడా 
ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్‌ పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తారు. ఉద్యోగ ఖాళీల సంఖ్యకు 50 రెట్ల అభ్యర్థులకు మెయిన్స్‌ పరీక్షల్లో అవకాశం కల్పిస్తారు. ప్రతి మల్టీ జోన్‌ వారీగా, రిజర్వేషన్లు, కమ్యూనిటీ, జెండర్, ఈడబ్ల్యూఎస్, పీహెచ్, స్పోర్ట్స్‌ కోటాల వారీగా ఎంపిక ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్‌ పరీక్షలను తెలుగు, ఇంగ్లిష్‌తో పాటు ఉర్దూ బాషలో నిర్వహించనున్నారు. గ్రూప్‌–1 పరీక్ష ఉర్దూ బాషలో నిర్వహించడం ఇదే తొలిసారి. అలాగే ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు కూడా తొలిసారిగా అమలు కానున్నాయి. 

ఇ–ప్రశ్నపత్రం: గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షల్లో ముద్రించిన ప్రశ్నపత్రాల స్థానంలో ఎలక్ట్రానిక్‌ ప్రశ్నపత్రం (ఇ– క్వశ్చన్‌పేపర్‌)ను ప్రవేశ పెట్టనున్నారు. అభ్యర్థుల ఎంపిక విధా నంలో సాంకేతిక మూల్యాంకనం (డిజిటల్‌ ఎవాల్యూయేన్‌) ప్రవేశపెడుతున్నారు.  మరిన్ని వివరాలు, పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను కమిషన్‌ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. 

వయోపరిమితి సడలింపు ఇలా... 
గ్రూప్‌–1 ఉద్యోగార్థుల గరిష్ట వయోపరిమితి జనరల్‌ పోస్టులకు 44 సంవత్సరాలు, యూనిఫాం పోస్టులకు 31 సంవత్సరాలుగా ఉంది.  ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంది. ఇది ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్టీసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పనిచేసే ఉద్యోగులకు వర్తించదు. మాజీ సైనికోద్యోగులకు 3 ఏళ్లు, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంది. 

దరఖాస్తు రుసుం రూ.200 
గ్రూప్‌–1 ఉద్యోగ దరఖాస్తు ప్రాసెసింగ్‌ ఫీజును రూ.200గా నిర్ణయించారు. పరీక్ష ఫీజు కింద అదనంగా రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మాజీ సైనికోద్యోగులు, డిక్లరేషన్‌ సమర్పించే నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ ఫీజులను ఆన్‌లైన్‌ పద్ధతిలోనే చెల్లించాల్సి ఉంటుంది. 
♦ప్రిలిమ్స్‌ పరీక్షను రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు. అభ్యర్థులు వరుస క్రమంలో 12 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవచ్చు. 
♦ప్రిలిమ్స్, మెయిన్‌ పరీక్షలకు సంబంధించి స్పష్టమైన తేదీలను కమిషన్‌ త్వరలో ప్రకటిస్తుంది. పరీక్ష తేదీకి వారం రోజుల ముందు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 
♦గ్రూప్‌–1 ఉద్యోగ నియామకాల్లో స్పోర్ట్స్‌ కోటా కింద 2 శాతం రిజర్వేషన్లను కల్పిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లో తెలిపింది. మొత్తంగా 29 రకాల క్రీడలకు సంబంధించి కోటా అమలు చేయనుంది.  

చదవండి: (రూ.50వేలకు ఆశపడి.. రూ.80లక్షలు పోగొట్టుకున్నాడు..)

మరిన్ని వార్తలు