గ్రూప్‌–1 దరఖాస్తుల ప్రక్రియలో అభ్యర్థులకు ఊరటనిచ్చిన టీఎస్‌పీఎస్సీ

27 May, 2022 00:47 IST|Sakshi

గ్రూప్‌–1 దరఖాస్తుల ప్రక్రియలో అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ వెసులుబాటు

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 ఉద్యోగ దరఖాస్తుల ప్రక్రియలో అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఊరటనిచ్చింది. బోనఫైడ్‌ సర్టిఫికెట్‌ను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయకున్నా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు కల్పించింది. ఈ నెల 31తో గ్రూప్‌–1 దరఖాస్తు ప్రక్రియ ముగియనుండగా టీఎస్‌పీఎస్సీ తాజా నిర్ణయంతో దరఖాస్తుల సమర్పణ జోరందుకుంది.

నూతన జోనల్‌ విధానం అమల్లోకి రావడంతో మెజారిటీ అభ్యర్థుల స్థానికతలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో గతంలో వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీఆర్‌) చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్‌ ఆప్షన్‌ ఇచ్చిన కమిషన్‌... ఈ మేరకు మార్పులు చేసుకోవాలని సూచిం చింది. దీంతో ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా ఒకటి నుంచి ఏడో తరగతి వరకు చదువుకున్న బోనఫైడ్‌ సర్టిఫికెట్‌ కాపీలను స్కాన్‌ చేసి అప్‌లోడ్‌ చేయాల్సి వచ్చింది.

ఈ నిబంధన చాలా మంది అభ్యర్థులకు ఇబ్బందులు తెచ్చిపెట్టిందనే విమర్శలు వచ్చాయి. పలువురు అభ్యర్థులు బోనఫైడ్‌ సర్టిఫికెట్‌ల కోసం పాఠశాలల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కమిషన్‌ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 

వివరాలు సమర్పిస్తే..: ఓటీఆర్‌ ఎడిట్‌ ఆప్షన్‌ లేదా నూతన ఓటీఆర్‌ నమోదు సమయంలో అభ్యర్థులు ఒకటి నుంచి ఏడో తరగతి వరకు చదువుకు న్న పాఠశాల, ప్రాంతం వివరాలను వెబ్‌సైట్‌లో ఎంట్రీ చేస్తే చాలు. ఆ తర్వాత గ్రూప్‌–1 దరఖాస్తును సమర్పించే వీలుంటుంది. అయితే ఇప్పుడు నమోదు చేసిన వివరాలకు సంబంధించిన అసలైన ధ్రువ పత్రాలను సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌లో మాత్రం తప్పకుండా చూపించాలి.

ఒకవేళ ఉద్యోగానికి ఎంపికై సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో ఒరిజినల్‌ ధ్రువపత్రాలు చూపకుంటే అభ్యర్థిని ప్రాథమిక జాబితా నుంచి తొలగించే అధికారం కమిషన్‌కు ఉంటుంది. అదేవిధంగా నమోదు చేసిన వివరాలు సరైనవి కాకుంటే అభ్యర్థిపై చట్టపరమైన చర్యలకు సిఫారసు చేసే అధికారం సైతం కమిషన్‌కు ఉంది. అందువల్ల అభ్యర్థులు సరైన వివరాలతో దరఖాస్తు సమర్పిస్తే మంచిదని అధికారులు సూచిస్తున్నారు.   

మరిన్ని వార్తలు