టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్ కేసు: ఎవరెవరి నుంచి ఎంతెంత వసూలు చేశారు? ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిలను ప్రశ్నించిన ఈడీ

19 Apr, 2023 09:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో జరిగిన ఆర్థిక లావాదేవీల మూలాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దృష్టిపెట్టింది. ఈ కేసులో కీలక నిందితులైన ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డిలను రెండోరోజైన మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించింది. ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్లు సుమిత్‌ గోయల్, దేవేందర్‌సింగ్‌ల నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందం మొదట ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డిలను చెంచల్‌గూడ జైల్లో వేర్వేరుగా ప్రశ్నించినట్లు సమాచారం. మధ్యాహ్నం తర్వాత ఇద్దరినీ కలిపి కూడా కొన్ని అంశాలపై ప్రశ్నించినట్లు తెలిసింది.

కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ నుంచి పేపర్లు కొట్టేశాక ఏయే పేపర్లను ఎవరికి, ఎంతకు అమ్మేందుకు బేరం కుదుర్చుకున్నారన్న దానిపై సోమవారం నాటి విచారణలో సేకరించిన వివరాల ఆధారంగా ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డిల బ్యాంకు స్టేట్‌మెంట్లను ముందుపెట్టి ప్రశ్నించినట్లు తెలియవచ్చింది. పేపర్ల లీకేజీ సొమ్ము మొత్తం రూ. 50 లక్షల మేర బేరసారాలు జరిగినట్లు సిట్‌ ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో ఆ మేరకు ఎంతెంత డబ్బు ఎవరెవరి ద్వారా సేకరించారన్న అంశాలపైనా ప్రశ్నించినట్లు సమాచారం.

ప్రవీణ్‌కుమార్‌ ఇంట్లో జరిపిన సోదాల్లో లభ్యమైన రూ. 4 లక్షలు, రాజశేఖర్‌రెడ్డి గత ఆరు నెలలుగా ఖర్చు చేసిన డబ్బు, ఆ సొమ్ముకు మూలం, అతను తిరిగిన ప్రాంతాలు వంటి అంశాలపైనే ప్రధానంగా విచారణ కొనసాగినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ కేసులో కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ అధికారి శంకరలక్షి్మ, మరో అధికారి సత్యనారాయణల నుంచి వివరాలు సేకరించిన ఈడీ అధికారులు... ప్రస్తుతం ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డిల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా మరికొందరిని సైతం కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డిల ఈడీ కస్టడీ మంగళవారంతో ముగిసింది.
చదవండి: పెళ్లీడు పెరిగింది.. 26 ఏళ్ల వరకు ఆగుతున్న కశ్మీరీ యువతులు.. తెలంగాణ అమ్మాయిలు ఎన్నేళ్లకు చేసుకుంటున్నారంటే..?

మరిన్ని వార్తలు