TSPSC Paper Leak Case: పేపర్‌ లీక్‌ కేసులో 12కి చేరిన నిందితులు.. మరిన్ని అరెస్టులు?

23 Mar, 2023 18:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసు దర్యాప్తులో సిట్‌ దూకుడు ప్రదర్శిస్తోంది. తొలుత 9 మందిని అరెస్ట్‌ చేయగా.. వాళ్ల విచారణ ద్వారా రాబట్టిన సమాచారంతో తాజాగా మరో ముగ్గురిని అరెస్ట్‌ చేసింది. దీంతో  ఈ కేసులో నిందితుల సంఖ్య 12కి చేరింది. టీఎస్‌పీఎస్సీ  తుట్టె కదులుతుండడంతో.. ఈ కేసులో రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు జరగొచ్చని తెలుస్తోంది.

ఇక పన్నెండు మంది నిందితులను గురువారం సాయంత్రం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు సిట్‌ అధికారులు. పేపర్‌ లీక్‌ కేసులో అరెస్ట్‌ అయిన తొమ్మిది మంది రిమాండ్‌ ఇవాళ్టితో ముగిసింది. దీంతో వాళ్లను కోర్టులో ప్రవేశపెట్టింది సిట్‌. ఈ క్రమంలో ఈ నెల 28 వరకు రిమాండ్‌ను పొడిగించింది కోర్టు.

అలాగే.. తాజాగా అరెస్ట్‌ అయిన ముగ్గురికి ఏప్రిల్‌ 6వ తేదీ వరకు(14 రోజుల) రిమాండ్‌ విధించింది నాంపల్లి కోర్టు. వీళ్లందరికీ వైద్య పరీక్షల అనంతరం చంచల్‌ గూడా జైలుకు తరలించారు సిట్‌ అధికారులు. మరోవైపు టీఎస్‌పీఎస్సీలోనే పని చేసే ఉద్యోగులకూ సిట్‌ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: డేటా చోరీ కేసులో కీలక పరిణామం

మరిన్ని వార్తలు