ఆ సెంటర్‌లో ఏం జరిగింది?.. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ వ్యవహారంపై టీఎస్‌పీఎస్సీ సీరియస్‌

22 Oct, 2022 10:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పాటయ్యాక తొలిసారిగా చేపట్టిన గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్షలో అపశ్రుతులు, ఆరోపణలపై రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) దృష్టిపెట్టింది. పలు పరీక్షా కేంద్రాల్లో ప్రశ్నపత్రాలు మారిపోవడం, నిర్ధారిత సమయం కంటే ఆలస్యంగా, ఎక్కువసేపు పరీక్ష నిర్వహించడం వంటివాటిని సీరియస్‌గా తీసుకుంది. ఆయా పరీక్షా కేంద్రాల్లో ఏం జరిగిందో గుర్తించేందుకు చర్యలు చేపట్టింది. 

కాగా, హైదరాబాద్‌ జిల్లా లాలాపేట్‌లోని శాంతినగర్‌ సెయింట్‌ ఫ్రాన్సిస్‌ హైస్కూల్‌ పరీక్షా కేంద్రంలో 47మంది అభ్యర్థులు నిర్ధారిత సమయం ముగిసిన తర్వాత పరీక్ష రాశారు. దీంతో ఆ పరీక్షా కేంద్రంలోని సీసీ కెమెరా ఫుటేజీలను తెప్పించి పరిశీలించాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. ఇందుకోసం టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలోని సీనియర్‌ అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు సమాచారం.

కారకులెవరు.. చర్యలేమిటి?
సెయింట్‌ ఫ్రాన్సిస్‌ హైస్కూల్‌ కేంద్రంలో 47 మందికి ఇంగ్లిష్‌–తెలుగు ప్రశ్నపత్రాలకు బదులు ఇంగ్లిష్‌–ఉర్ధూ ప్రశ్నపత్రాలు ఇవ్వడంతో అభ్యర్థులు ఆందోళన చేశారని.. ఉన్నతాధికారులు నచ్చజెప్పి మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 3.30గంటల వరకు పరీక్ష నిర్వహించారని హైదరాబాద్‌ అదనపు కలెక్టర్‌ ప్రకటించారు. ఈ క్రమంలో ఆ సెంటర్‌లో విధులు నిర్వహించిన ఉద్యోగులు ఎవరు? ప్రశ్నపత్రం మారిపోవడానికి కారకులెవరు? నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారెవరు అన్న కోణంలో టీఎస్‌పీఎస్సీ విచారణ చేస్తోంది. 

దీనితోపాటు ప్రశ్నపత్రం మార్పుపై ఆందోళన మొదలు పెట్టిందెవరు, అభ్యర్థులను రెచ్చగొట్టిందెవరన్న వివరాలనూ ఆరా తీసే పనిలో ఉంది. ఇంత జరిగినా విషయాన్ని టీఎస్‌పీఎస్సీ దృష్టికి తీసుకురాకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారని.. మొత్తం వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదికిచ్చి చర్యలకు సిఫార్సు చేయనున్నారని కమిషన్‌ వర్గాలు చెబుతున్నాయి.

భవిష్యత్తులో జరగకుండా..
టీఎస్‌పీఎస్సీ నిర్వహించే పరీక్షల విషయంలో మరింత కఠినంగా నిబంధనలు తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. పరీక్షా కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహిరించే వారిని భవిష్యత్తులో ఎలాంటి పరీక్షలకు హాజరుకాకుండా బ్లాక్‌లిస్ట్‌లో చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. అలాంటివారి వల్ల పరీక్షా కేంద్రంలో ప్రశాంత వాతావరణం మారిపోయి, ఇతర అభ్యర్థులు సరిగా పరీక్ష రాయలేని పరిస్థితి ఏర్పడుతుందని కమిషన్‌ వర్గాలు చెబుతున్నాయి.  

అభ్యర్థుల్లో ప్రభుత్వ ఉద్యోగులు?
సెయింట్‌ ఫ్రాన్సిస్‌ హైసూ్కల్‌ సెంటర్‌లో ఆందోళన చేసిన అభ్యర్థుల్లో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్టు తెలుస్తోంది. ఒక అభ్యర్థి తానెవరో పరిచయం చేసుకుంటూ.. ఇతర అభ్యర్థులను రెచ్చగొట్టారని, ఆందోళన జరుగుతున్న సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిని సైతం బెదిరించారని పరీక్షా కేంద్రంలో విధులు నిర్వహించిన వారు చెప్పినట్టు తెలిసింది. ఇలా ఆందోళనకు పాల్పడి పరీక్షా కేంద్రంలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టిన వారిపైనా చర్యలు తీసుకోవాలని కమిషన్‌ భావిస్తున్నట్టు సమాచారం. 

మరిన్ని వార్తలు