Telangana ఆర్టీసీ ఉద్యోగులకు 5 శాతం డీఏ

26 Apr, 2022 02:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఆర్టీసీ ఉద్యోగులకు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కరువు భత్యం పెరుగుతోంది. వచ్చేవేతనాల నుంచి అందుకునేలా 5% డీఏను చెల్లించనున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. మూల వేతనంపై ఐదు శాతం అంటే.. డ్రైవర్, కండక్టర్, శ్రామిక్‌ వంటి యూనిఫారం ఉద్యోగులకు కనిష్టంగా రూ.600 నుంచి గరిష్టంగా రూ.1,500 వరకు భత్యం జతకలుస్తుంది.

వివిధ కేటగిరీల్లోని అధికారులకు రూ.1,500 నుంచి రూ.5,500 వరకు వేతనం అదనంగా అందనుంది. ఈ డీఏ ప్రకటనతో ఆర్టీసీపై నెలకు రూ.5 కోట్ల వరకు భారం పడుతుం దని అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి ఉద్యోగులు 2019లో సుదీర్ఘ సమ్మె చేయటం, తర్వాత కోవిడ్‌ దెబ్బతో.. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతిని, డీఏల చెల్లింపు ఆగిపోయింది.

ఆరు డీఏలు కలిపి 27శాతం వరకు రావాల్సి ఉందని.. వెంటనే చెల్లించా లని ఉద్యోగులు చాలా రోజులుగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజా డీఏ ఆదేశాలు జారీ అయ్యాయి. బకాయిల అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు. అసలు అధికారికంగా ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. కాగా.. సుదీర్ఘ విరామం తర్వాత డీఏ పెంచటం కార్మికులకు ఆర్థికంగా వెసులుబాటేనని.. అయితే పెండింగ్‌ డీఏల ప్రకారం ఇవ్వాలని, ఎరియర్స్‌ చెల్లించాలని టీఎంయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తిరుపతి, ఏఆర్‌ రెడ్డి, ఎన్‌ఎంయూ అధ్యక్ష, కార్యదర్శులు కమాల్‌రెడ్డి, నరేందర్‌ డిమాండ్‌ చేశారు.   

మరిన్ని వార్తలు