తెలంగాణ-ఏపీ: మళ్లీ బస్సులు..

2 Nov, 2020 01:43 IST|Sakshi

తెలంగాణ, ఏపీ మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల సమస్య కొలిక్కి

రూట్లు, కిలోమీటర్ల లెక్కలపై కుదిరిన అవగాహన

నేడు ఉన్నతాధికారుల సమావేశంలో ఒప్పందం

హైదరాబాద్‌–విజయవాడ మార్గంలో పెరగనున్న రాష్ట్ర బస్సులు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పందం విషయంలో తలెత్తిన ప్రతిష్టంభణకు ఎట్టకేలకు తెరపడింది. ఈ అంశంపై ఇరు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య పరస్పర అవ గాహన కుదిరింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల అధి కారులు సోమవారం హైదరా బాద్‌లో సమావేశమై ఒప్పం దం కుదుర్చు కోనున్నారు. ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే తెలంగాణ నుంచి ఏపీకి, ఏపీ నుంచి తెలంగాణకు బస్సులు మళ్లీ తిరగనున్నాయి. మారిన లెక్కలు...: కొత్త అవగాహన మేరకు తెలంగాణ ఆర్టీసీ ఏపీ పరిధిలో 1,61,258 కి.మీ. మేర బస్సులు తిప్పనుం డగా ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ తెలంగాణ పరిధిలో 1,60,919 కి.మీ. మేర బస్సులు తిప్పనుంది. ఇప్పటివరకు ఏపీఎస్‌ ఆర్టీసీ తెలంగాణ పరిధిలో 1,009 బస్సులను ఏకంగా 2,65,367 కి.మీ. మేర తిప్పుతోంది.

ప్రధాన పీటముడిగా మారిన హైదరాబాద్‌–విజయవాడ మార్గంలో ఇంతకాలం ఏపీఎస్‌ఆర్టీసీ 374 బస్సులు తిప్పుతుండగా ఇప్పుడు ఆ సంఖ్యను 192కు తగ్గించుకోనుంది. వెరసి ఈ మార్గంలో 51,178 కి.మీ. మేర వాటి పరిధిని తగ్గించుకోనుండటం గమనార్హం. ఇదే సెక్టార్‌లో తెలంగాణ బస్సులు ఏపీ పరిధిలో 162 మాత్రమే 33,736 కి.మీ. మేర తిరిగేవి. కొత్త నిర్ణయం ప్రకారం 273 బస్సులు 52,384 కి.మీ. మేర తిరగనున్నాయని సమాచారం. విజయవాడ సెక్టార్‌లోనే కాకుండా కర్నూలు సెక్టార్‌లో 25 వేల కి.మీ. మేర, భద్రాచలం సెక్టార్‌లో 13 వేల కి.మీ. మేర తెలంగాణలో తిరిగే పరిధిని ఏపీ తగ్గించుకుంది. మొత్తంగా బస్సుల సంఖ్య, వేళల విషయంలో మార్పుచేర్పులు జరిగాయి. ఇంతకాలం ఈ విషయంలో రెండు ఆర్టీసీల మధ్య ఏకాభిప్రాయం కుదరక కాలయాపన జరిగింది.

దసరా ఆదాయం ప్రైవేటుపరం..
కొత్త నిర్ణయంతో సాలీనా రూ. 270 కోట్ల మేర ఏపీ ఆదాయాన్ని కోల్పోనుంది. అంతే మొత్తంలో ఆదాయాన్ని తెలంగాణ ఆర్టీసీ కొత్తగా పొందే అవకాశం ఉంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీలు ఒకేసారి అంత ఆదాయాన్ని కోల్పోవడమంటే సాధారణ విషయం కాదు. అంతమేర మరో రూపంలో ఆదాయం పెంచుకోకుంటే నష్టాలు మరింత పెరుగుతాయి. అందుకే తమ బస్సుల సంఖ్యను తగ్గించుకోవడం కంటే తెలంగాణ ఆర్టీసీ అంత మేరకు బస్సులను పెంచుకుంటే సరిపోతుందని ఏపీఎస్‌ఆర్టీసీ చెబుతూ వచ్చింది. అయితే ఇప్పటికే తాము తీవ్ర నష్టాల్లో ఉన్నందున అంతమేర బస్సుల సంఖ్య పెంచుకోవడం సాధ్యం కాదని, దానివల్ల ఆదాయం ఆ దామాషాలో పెరిగే అవకాశం ఉండదని, తద్వారా నష్టాలు మరింత పెరుగుతాయని టీఎస్‌ఆర్టీసీ వాదిస్తూ వచ్చింది. ఈ విషయమై వెంటనే ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో కీలకమైన దసరా ఆదాయాన్ని రెండు ఆర్టీసీలు కోల్పోయాయి. పండుగ రాబడిని ప్రైవేటు బస్సులు తన్నుకుపోయాయి.

టీఎస్‌ఆర్టీసీకి లబ్ధి..
ప్రస్తుతం టీఎస్‌ఆర్టీసీ బస్సులు కాస్త మెరుగైన ఆక్యుపెన్సీ రేషియో స్థితికి చేరుకొనే సూచనలు కనిపిస్తున్నాయి. మొన్నటివరకు రోజువారీ ఆదాయం రూ. 4 కోట్లకే పరిమితమవగా ప్రస్తుతం ఆ మొత్తం రూ. 7 కోట్లకు చేరుకుంది. ఇప్పుడు ఏపీకి కూడా బస్సులు మొదలైతే ఆ మొత్తం రూ. 10 కోట్లకు చేరుకోనుంది. అంటే నెలకు రూ. 300 కోట్ల వరకు ఆదాయం సమకూరనుంది. ఫలితంగా ఇకపై జీతాలు, డీజిల్‌ బిల్లులు చెల్లించడం పెద్ద కష్టం కాబోదు. ఇతర బకాయిలు తీరాలంటే మాత్రం ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తే తప్ప తీరే పరిస్థితి లేదు. లాక్‌డౌన్‌కు పూర్వం ఆర్టీసీ రోజువారీ ఆదాయం రూ. 12 కోట్లకుపైగా ఉండేది. క్రమంగా ఆక్యుపెన్సీ రేషియో పెరిగితే మరో రెండు నెలల్లో దాన్ని చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఒప్పందం కుదిరిన వెంటనే బస్సులు
అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పందం విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన భేదాభిప్రాయాలు సమసిపోయాయి. మా న్యాయమైన డిమాండ్‌ను ఏపీఎస్‌ఆర్టీసీ అంగీకరించింది. ఆర్టీసీల మధ్య ఒప్పందం జరిగిన వెంటనే ఇరు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు మొదలవుతాయి.
– పువ్వాడ అజయ్‌కుమార్, రవాణా మంత్రి 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు