త్వరలో ఆర్టీసీ నీళ్లు

29 May, 2022 02:44 IST|Sakshi

సొంత బ్రాండ్‌తో ప్యాకేజ్డ్‌ వాటర్‌ అందుబాటులోకి తేవాలని నిర్ణయం 

బస్సులు, బస్టాండ్లలో అవే సీసాలు 

రైల్వే రైల్‌నీర్‌ తరహా ప్రణాళిక? 

కుదిరితే అవి మాత్రమే అమ్మే యోచన 

ఓ ప్రైవేటు సంస్థతో ఒప్పందానికి సంప్రదింపులు 

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో టీఎస్‌ఆర్టీసీ మంచినీళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రత్యేకంగా ఆర్టీసీ బ్రాండ్‌తో ప్యాకేజ్డ్‌ తాగునీటిని ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని సంస్థ నిర్ణయించింది. రైల్‌ నీర్‌ పేరుతో రైల్వే సొంత బ్రాండ్‌తో నీటిని స్టేషన్లలో విక్రయిస్తున్న తరహాలోనే ఆర్టీసీ కూడా సొంత బ్రాండ్‌తో బస్సులు, బస్టాండ్లలో విక్రయించనుంది.

ఈమేరకు నగర శివారులోని ఓ ప్యాకేజ్డ్‌ వాటర్‌ ప్లాంట్‌తో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ నీటి విక్రయం లాభసాటిగా ఉంటే, సొంత తయారీ యూనిట్‌ను ప్రారంభించాలని భావిస్తోంది. టికెట్‌ రూపంలో వచ్చే ఆదాయంతో ఆర్టీసీ మనుగడ దాదాపు ప్రశ్నార్థకం కావటంతో ప్రత్యామ్నాయ ఆదాయంపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సొంత బ్రాండ్‌ ప్యాకేజ్డ్‌ నీటిని విక్రయించాలని నిర్ణయించింది.  

డివిజినల్‌ మేనేజర్‌ స్థాయి అధికారికి బాధ్యత  
ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో సగటున నిత్యం 33 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. కోవిడ్‌కు ముందున్న స్థితికి చేరుకోవటంతో, ఇంత భారీ సంఖ్యలో ప్రయాణికుల ద్వారా కేవలం టికెట్‌ డబ్బులు మాత్రమే కాకుండా.. నీటిని అమ్మడం ద్వారా కూడా ఆదాయాన్ని పొందాలని భావిస్తోంది. ఇతర కంపెనీలతో పోలిస్తే కొంత తక్కువ ధరను విక్రయించడం ద్వారా డిమాండ్‌ను సృష్టించుకోవాలని చూస్తోంది.

ప్రస్తుతం బస్టాండ్లలో పేరున్న బ్రాండ్లతోపాటు స్థానికంగా తయారయ్యే ఎన్నో రకాల మంచినీటి సీసాలు అందుబాటులో ఉంటున్నాయి. కానీ వీటిలో చాలావరకు నాణ్యత ఉండటం లేదన్న ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో, సొంత బ్రాండ్‌ పేరుతో నాణ్యమైన నీటిని అందుబాటులోకి తెస్తే బాగుంటుందని ఇటీవల ఎండీ సజ్జనార్‌ నిర్ణయించారు. ఆమేరకు ఓ డివిజినల్‌ మేనేజర్‌ స్థాయి అధికారికి బాధ్యత అప్పగించారు. ఓ ప్రైవేట్‌ సంస్థతో ఒప్పందం దాదాపు కొలిక్కి వచ్చిందని తెలిసింది.  

గతంలో బిస్లెరీతో ఒప్పందం 
గతంలో రమణారావు  ఎండీగా ఉన్న సమయంలో బిస్లెరీ సంస్థతో ఆర్టీసీ ఒప్పందం చేసుకుంది. ఆర్టీసీ లోగోను కూడా ముద్రించిన సీసాలను బస్టాండ్లలో విక్రయించేలా ఏర్పాట్లు చేసింది. తొలుత కేవలం ఆ సీసాలను మాత్రమే అమ్మాలని నిబంధన విధించినా.. న్యాయపరమైన చిక్కులు రావటంతో వెనకడుగు వేసింది. ప్రస్తుతం ఆర్టీసీ లోగో చిన్నగా ఉన్న సీసా నీటిని బిస్లెరీ అమ్ముతోంది.

కానీ దీనివల్ల ఆర్టీసీ బ్రాండ్‌కు గుర్తింపు రాలేదని ఆర్టీసీ తేల్చింది. దీంతో సొంతంగా కేవలం ఆర్టీసీ పేరుతోనే నీటి సీసాలను తేవాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు కాంప్లిమెంటరీగా 500 మి.లీ. బిస్లెరీ సీసాలను ఇస్తోంది. సొంత బ్రాండ్‌ అందుబాటులోకి వచ్చాక, ఆ కాంప్లిమెంటరీ సీసాలతోపాటు, అన్ని బస్సుల్లో సొంత నీటి సీసాలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. డ్రైవర్‌/కండక్టర్‌ టికెట్లతోపాటు నీటి సీసాలనూ విక్రయించేలా ఏర్పాట్లు చేయనున్నారు. కుదిరితే, బస్టాండ్లలో కేవలం ఆర్టీసీ బ్రాండ్‌ సీసా నీళ్లు మాత్రమే విక్రయించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. 

పేరు, డిజైన్‌ చెప్పండి 
సొంతంగా ఆర్టీసీ బ్రాండ్‌తో తయారయ్యే నీటికి ఏ పేరు పెడితే బాగుంటుందో, సీసా ఆకృతి ఎలా ఉంటే బాగుంటుందో 9440970000 వాట్సాప్‌ నంబర్‌కు సూచనలను పంపాలని ఆర్టీసీ కోరింది. ఎంపిక చేసిన వాటికి రివార్డు ఇవ్వనున్నట్టు ప్రకటించింది.   

మరిన్ని వార్తలు