చక్రం తిరుగుతున్నా.. పెరగని ఆదాయం

11 Aug, 2020 11:32 IST|Sakshi

ప్రయాణికుల్లేక సగం బస్సులు కూడా రోడ్డెక్కని వైనం 

ఆందోళనలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది  

ఆర్టీసీ చక్రాలు... ప్రగతికి చిహ్నాలు అనేది పేరు మోసిన స్లోగన్‌. కానీ నేడు పరిస్థితులు మారాయి. మాయదారి రోగమొచ్చి బస్సు చక్రాలను వెనక్కు తిప్పుతోంది. భయంతో జనాలు బస్సెక్కడమే తగ్గించేశారు. 

మంచిర్యాల అర్బన్‌: ఆర్టీసీ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతోంది. కరోనా కాటుకు ఆర్టీసీ బలైపోయింది. కరోనా కంగారుతో ఆర్టీసీ చక్రాలు వెనక్కు తిరుగుతున్నాయి. దీంతో సంస్థ నష్టాల్లో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతోంది. ఖాళీ సీట్లతో ఆర్టీసీ బస్సులు వెక్కిరిస్తున్నాయి. సగం బస్సులు రోడ్డెక్కుతున్నా ఆదాయం మాత్రం రోజురోజుకూ పడిపోతూ పాతాళానికి చేరుతోంది. రాబడి తగ్గి ఉద్యోగులకు బలవంతపు సెలవులిచ్చి ఇంటికి పంపుతున్నట్లు సమాచారం. ఏ రోజుకారోజు ఆదాయం విషయంలో సంస్థ గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పట్లో కరోనా తగ్గుముఖం పట్టేలా లేకపోవటంతో గట్టెక్కేమార్గమేదో తెలియక అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.  

తగ్గిన ఆర్టీసీ బస్సులు.. పెరిగిన అద్దెబస్సులు
మంచిర్యాల డిపో 47 ఏళ్ల కిందట ఏర్పాటు చేశారు. డిపోలో 141 బస్సులున్నాయి. ఇందులో గతంలో 91 సంస్థ బస్సులు కాగా 48 అద్దెబస్సులు ఉండేవి. ప్రస్తుతం అద్దెబస్సులు 59కి పెరిగాయి. మొత్తం డిపోలో 575 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా నేపథ్యంలో పూర్తి స్థాయిలో బస్సులు నడపకపోవటంతో రొటేషన్‌ పద్ధతిలో ఉద్యోగులకు విధులు కేటాయిస్తున్నారు. కొంత మందిని బలవంతపు సెలవులు పెట్టించి ఇంటికి పంపుతున్నారని వినికిడి. దీంతో వారంలో రెండు రోజులు ఇంటి వద్దనే ఉండాల్సిన పరిస్థితి ఉద్యోగులకు దాపురించింది. 

బస్సులు నడుస్తున్నా  భరోసా ఏదీ? 
కరోనా వైరస్‌ భయం అంతటా నెలకొంది. వైరస్‌ వ్యాప్తితో చాలా మంది ప్రయాణికులు ఇంటికే పరిమితమవుతున్నారు. ప్రస్తుతం ఆటోలు విపరీతంగా పెరిగి పల్లె వెలుగు సర్వీసుల ఆదాయం గణనీయంగా పడిపోయింది. వ్యక్తిగత వాహనాలను ఎక్కువగా వినియోగించటంతో ఆర్టీసీకి ఆదరణ తగ్గింది. ఆర్టీసీకి సూపర్‌లగ్జరీ, దూరప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసుల ద్వారానే ఆదాయం వచ్చేది. ప్రస్తుతం పల్లె, పట్టణం అనే తేడా లేకుండా కరోనా వ్యాప్తితో ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. మరీ అత్యవసరమైతే కాస్త ఖర్చెక్కువైనా పర్వాలేదని సొంత వాహనాలను వినియోగిస్తున్నారు. రోజూ బస్సులను శానిటైజ్‌ చేస్తున్నా ప్రయాణికులు బస్సు ప్రయాణమంటేనే జంకుతున్నారు. వైరస్‌ కట్టడికి అధికారులు అప్రమతమై ఎన్ని చర్యలు చేపట్టినా ప్రయాణికుల్లో భరోసా కలగట్లేదు. 

పడిపోయిన ఆదాయం
గతేడాది మూడు నెలల ఆదాయంతో పోల్చితే ఈ ఏడాది ఆదాయం దారుణంగా పడిపోయింది. మే, జూన్, జూలై నెలల్లో సంస్థకు దండిగా ఆదాయం వచ్చేది. కానీ ఈ ఏడు కరోనా భయంతో ఎవరూ ప్రయాణాలు చేయలేదు. దీంతో అధికారుల అంచనాలు, లెక్కలూ తలకిందులయ్యాయి. బస్సుల్లో జూన్‌ మినహా ఆక్యూపెన్సీ రేషియో (ఓఆర్‌) 40 శాతం ఉండటం గమనార్హం. దీంతో ఆర్టీసీ సంస్థ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. మున్ముందు ఇదే పరిస్థితి నెలకొంటే ఉద్యోగుల హక్కులు, సౌకర్యాల మాటేలా ఉన్నా వేతనాలు ఇచ్చేందుకు కష్టమేనని ఓ అధికారి ఆందోళన వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు