12 ఏళ్ల తర్వాత ఊరికి బస్సొచ్చింది

20 Nov, 2021 04:43 IST|Sakshi

కొత్తగూడెం నుంచి కాకర్ల గ్రామానికి బస్‌ సర్వీస్‌ ప్రారంభంm   

జూలూరుపాడు: 12 ఏళ్ల తర్వాత ఓ గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసు తిరిగి ప్రారంభమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి కొత్తగూడెం డిపోకు చెందిన బస్సు సర్వీసు శుక్రవారం మొదలైంది. ఈ గ్రామానికి గతంలో బస్సు నడిచినా రోడ్డు బాగా లేదని, ఆదరణ ఉండడం లేదనే కారణంతో 12 ఏళ్ల కిందట సర్వీసు నిలిపివేశారు. దీంతో గ్రామానికి చెందిన చెవుల బాలరాజు ఈనెల 7న ట్విట్టర్‌లో టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు తమ సమస్యపై విన్నవించారు.

దీంతో ఆయన రూట్‌ మ్యాప్‌ పరిశీలించి గ్రామానికి బస్సు నడపాలని కొత్తగూడెం డిపో మేనేజర్‌ వెంకటేశ్వరబాబుకు రీట్వీట్‌ చేశారు. ఈమేరకు 11న సీనియర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ మాంచా నాయక్, కంట్రోలర్‌ జాకంతో కలిసి కొత్తగూడెం డీఎం.. గ్రామానికి చేరుకుని సాధ్యాసాధ్యాలపై చర్చించారు. అనంతరం సర్వీసు ప్రారంభించగా.. గ్రామస్తులు బస్సుకు మామిడి తోరణాలు, కొబ్బరి ఆకులు కట్టి స్వీట్లు పంచుకున్నారు. ఈ విషయాన్ని వివరిస్తూ గ్రామంలో డప్పు చాటింపు కూడా వేయించారు.

ఈటల భూముల్లో నాలుగో రోజు సర్వే 
వెల్దుర్తి(తూప్రాన్‌): మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల శివారుల్లో మాజీ మంత్రి ఈటల కుటుంబీకుల భూముల్లో నాలుగో రోజు కూడా సర్వే కొనసాగింది. శుక్రవారం రెవెన్యూ అధికారులు సర్వే నంబర్లు 77, 78, 79, 80, 81, 82లోని భూములను సర్వే చేశారు. ఈ సందర్భంగా ఆయా సర్వే నంబర్లతో పాటు రైతుల వారీగా హద్దులు ఏర్పాటు చేశారు.

ఇందుకోసం అధికారులు 500 హద్దురాళ్లు తెప్పించారు. మాసాయిపేట రెవెన్యూ కార్యాలయంలో ఆయా గ్రామాలకు చెందిన రికార్డులను తూప్రాన్‌ ఆర్డీఓ శ్యాంప్రకాశ్‌ పరిశీలించారు. సర్వే నంబర్ల వారీగా పట్టా భూమి ఎంత ఉంది.. అసైన్డ్, సీలింగ్‌ భూములు ఎన్ని ఉన్నాయి.. ప్రభుత్వం పంపిణీ చేసిన సీలింగ్‌ భూముల్లో ఇతరులు పాగా వేశారా? వంటి వివరాలను ఆయన తెలుసుకున్నారు.   

మరిన్ని వార్తలు