బస్సులకిక బయటి ఇంధనమే!

23 Feb, 2022 03:12 IST|Sakshi
మంగళవారం రాత్రి ఖమ్మంలోని ఓ పెట్రోల్‌ బంక్‌ ముందు బారులు తీరిన ఆర్టీసీ బస్సులు 

ఆయిల్‌ కంపెనీలు సరఫరా చేసే డీజిల్‌ ధరల్లో హెచ్చుతగ్గులే కారణం

ఖమ్మం మయూరి సెంటర్‌: ఆర్టీసీకి ఆయిల్‌ కంపెనీల నుంచి డీజిల్‌ సరఫరా చేసే క్రమంలో ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతుండటంతో బయటి బంకుల్లోనే డీజిల్‌ పోయించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. దీన్ని పేరు చెప్పడానికి అంగీకరించని ఓ ఆర్టీసీ అధికారి ధ్రువీకరించారు. ట్యాక్స్‌లు ఇతరత్రా తేడాలతో ఆర్టీసీకి సరఫరా చేసే డీజిల్‌ ధర లీటర్‌గా రూ.97గా ఉంటోంది. కానీ, బయటి బంకుల్లో రూ.94.71గా ఉండటం గమనార్హం.

ఇందులో భాగంగా రాష్ట్ర రవాణామంత్రి పువ్వాడ అజయ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా కేంద్రంలోని బంక్‌ల యజమానుల నుంచి కొటేషన్లు స్వీకరించగా, శ్రీశ్రీ హెచ్‌పీ బంక్‌ యజమాన్యం లీటర్‌ డీజిల్‌ను రూ.94.53కు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ మేరకు మంగళవారం  నుంచి  బస్సులన్నింటినీ బంక్‌కు పంపించగా రాత్రి 11 గంటల వరకు బారులు తీరి కనిపించాయి.

కాగా, విధులు ముగించుకుని 9.30 గంటల తర్వాత వచ్చిన డ్రైవర్లు బస్సులతో బంక్‌ వద్ద పడిగాపులు కాస్తున్నారు. మళ్లీ ఉదయమే డ్యూటీకి వెళ్లాల్సిన తమను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని డ్రైవర్లు వాపోయారు. ఖమ్మం రీజియన్‌లోని అన్ని డిపోల బస్సుల్లో బుధవారం నుంచి బయటి బంకుల్లో డీజిల్‌ పోయించనున్నట్లు తెలిసింది. 

మరిన్ని వార్తలు