TSRTC Mangoes Home Delivery: ఆర్టీసీకి ఆర్డరిస్తే మీ ఇంటికే బంగినపల్లి

4 May, 2022 02:17 IST|Sakshi

మామిడి పండ్ల సరఫరా ప్రారంభించిన ఆర్టీసీ కార్గో

సాక్షి, హైదరాబాద్‌: మేలు రకం బంగినపల్లి మామిడి పండ్లు కావాలా.. అయితే ఆర్టీసీకి ఆర్డరివ్వండి.. మీ ఇంటికే వచ్చేస్తాయి. తెలంగాణలో బంగినపల్లి మామిడికి జగిత్యాల జిల్లా పరిసర ప్రాంతాలు ప్రసిద్ధి. ఆ ప్రాంతంలోని రైతులతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. అక్కడి తోటల్లో పండిన మేలు రకం పండ్లను కోరిన వారి ఇంటికి చేర్చే పని ఆర్టీసీ కార్గో విభాగం ప్రారంభించింది.  

ప్రభుత్వం నిర్దేశించిన పద్ధతిలో మగ్గించి.. 
మామిడి పండ్లంటే ఎంతో ఇష్టమున్నా.. కార్బైడ్‌ లాంటి నిషిద్ధ రసాయనాలతో బలవంతంగా మగ్గించిన పండ్లే ఎక్కువగా మార్కెట్‌లో అందుబాటులో ఉంటుండటంతో వాటిని తినేందుకు ప్రజలు జంకుతున్నారు. ఇలాంటి భయాలు లేకుండా, ప్రభుత్వం నిర్దేశించిన పద్ధతిలో మగ్గించిన బంగినపల్లి మామిడి పండ్లనే సరఫరా చేస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.  అయితే కనీసం ఐదు కిలోలకు తగ్గకుండా ఆర్డర్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

5, 10, 15, 20 కిలోలు.. ఇలా టన్నుల్లో ఆర్డర్‌ ఇచ్చినా సరఫరా చేస్తామని కార్గో విభాగం చెప్తోంది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఎస్‌ఆర్‌టీసీపీఏఆర్‌సీఈఎల్‌.ఇన్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చి సరిపడా నగదు చెల్లిస్తే ఆర్డర్‌ ఇచ్చిన ఏడో రోజు నాటికి పండ్లతో కూడిన పార్శిల్‌ బాక్సులను చిరునామాకు తీసుకొచ్చి అందిస్తామని ఆర్టీసీ కార్గో విభాగం అధికారులు పేర్కొంటున్నారు.

5 కిలోలకు రూ.581, 10 కేజీలకు రూ.1,162, 15 కిలోలకు రూ.1,743, 500 కేజీలకు రూ.58,075 చొప్పున ధర చెల్లించాల్సి ఉంటుందని ఆర్టీసీ కార్గో విభాగం ఓ ప్రకటనలో పేర్కొంది. మధురమైన బంగినపల్లి మామిడిని ఎలాంటి ప్రయాస లేకుండా సులభంగా ఆర్టీసీ కార్గో విభాగం ద్వారా ఇంటికే తెప్పించుకోవాలని, తద్వారా వాటిని పండించే రైతులను ప్రోత్సహించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కోరారు. కావాల్సిన వారు 040–23450033/ 040–69440000 టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు.     

మరిన్ని వార్తలు