TSRTC: నష్టాల సాకు.. బస్సులకు బ్రేకు

12 Sep, 2022 03:00 IST|Sakshi

‘గ్రేటర్‌’లో సిటీ బస్సులకు ఆర్టీసీ  కోత 

ఐదేళ్లలో 3,850 నుంచి 2,550కి తగ్గిన బస్సుల సంఖ్య 

మెట్రో నగరాల్లో కొత్త బస్సులు రోడ్డెక్కుతుంటే ఇక్కడ రివర్స్‌ గేర్‌ 

రైల్వేస్టేషన్లకు బస్సుల అనుసంధానమూ అంతంతే..

వ్యక్తిగత వాహనాలు పెరిగి కిక్కిరిసిపోతున్న రహదారులు 

సాక్షి, హైదరాబాద్‌: ప్రగతి రథచక్రం ప్రజారవాణా నుంచి మెల్లగా తప్పుకుంటోంది. నష్టాల సాకుతో బస్సు సర్వీసులకు కోత పెడుతూ ‘సిటీ’జనులను ప్రత్యామ్నాయ రవాణా మార్గాల వైపు మళ్లేలా చేస్తోంది. దేశవ్యాప్తంగా మహానగరాల్లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సుల సంఖ్యను ఆయా రాష్ట్రాల రవాణా సంస్థలు పెంచుతుండగా.. మన గ్రేటర్‌లో మాత్రం బస్సుల సంఖ్య దాదాపు సగానికి తగ్గిపోయింది.

సామర్థ్యానికి మించి రాకపోకలు సాగించిన బస్సులను ఫిట్‌నెస్‌లేమి కారణంగా తుక్కుకు పంపిస్తుండగా.. వాటి స్థానాన్ని భర్తీ చేసేందుకు సరిపడా బస్సులను రోడ్డెక్కించడంలో ఆర్టీసీ విఫలమవుతోంది. దీనికి సంస్థ ఆర్థిక నష్టాలే ప్రధాన కారణం. దీంతో కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవాటిని కొనుగోలు చేయడం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంస్థకు భారంగా పరిణమించింది. ఆక్యుపెన్సీ బాగా ఉన్నా.. ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తున్న రూట్లలోనూ బస్సుల సంఖ్య పెంచుకోకపోవడానికి ఇది ప్రధాన అడ్డంకిగా మారింది. 

కేవలం 2,550 బస్సులే.. 
సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియాగా పేరొందిన బెంగళూరు జనాభా 1.30 కోట్లు. ఆ నగరంలో సిటీ బస్సుల సంఖ్య 6 వేలు. మరో 2,500 బస్సులను కొనేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందించింది. అదే కోటి జనాభా దాటిన మన భాగ్యనగరంలో బస్సుల సంఖ్య ఎంతో తెలుసా? కేవలం 2,550 మాత్రమే. ఐదేళ్లలో హైదరాబాద్‌లో సిటీ బస్సుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అదే సమయంలో బెంగళూరు సహా ముంబై, ఢిల్లీ నగరాల్లో బస్సుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది.

మెట్రో నగరాల్లో ప్రజారవాణా సేవలను విస్తరించేందుకు ఆయా రవాణా సంస్థ ప్రత్యేకకార్యాచరణను అమలు చేస్తున్నాయి. శివార్లకు బస్సుల సంఖ్య పెంచడం, విమాన, రైల్వేస్టేషన్లకు బస్సులను అనుసంధానించడం ద్వారా రవాణా సేవలను అందుబాటులోకి తెస్తున్నాయి. అదే మన గ్రేటర్‌లో మాత్రం సిటీ బస్సుల సంఖ్య తగ్గి వ్యక్తిగత వాహనాలు భారీగా పెరిగాయి. మెట్రో, ఎంఎంటీఎస్, సిటీ బస్సుల మధ్య అనుసంధానత లేకపోవడంతో నగరవాసులు వ్యక్తిగత వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో సుమారు 74 లక్షల సొంత వాహనాలతో రహదారులు కిక్కిరిసిపోతున్నాయి.  

పడిపోయిన ప్రజా రవాణా... 
రవాణారంగ నిపుణుల అంచనాల ప్రకారం 2015 నాటికే హైదరాబాద్‌ నగరానికి కనీసం 6 వేల బస్సులు అవసరం. కానీ 2013 నుంచి ఇప్పటివరకు కేవలం 80 ఏసీ బస్సులు మాత్రమే కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. అప్పటివరకు ఉన్న 3,850 బస్సులలో 850 బస్సులను కార్గో వాహనాలుగా మార్చారు. మరికొన్నింటికి కాలం చెల్లిపోవడంతో తుక్కుగా మార్చారు. వాటి స్థానంలో ఒక్క నయా బస్సు కూడా అందుబాటులోకి రాలేదు. మూడేళ్ల  క్రితం వరకు రోజుకు 42 వేల ట్రిప్పుల చొప్పున సుమారు 9 లక్షల కిలోమీటర్ల పైచిలుకు తిరిగిన బస్సులు ఇప్పుడు 30 వేల ట్రిప్పులు కూడా తిరగ­డం లేదు.

హైదరాబాద్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సులను మళ్లీ ప్రవేశపెట్టాలని భావించినా నిధుల్లేమి కారణంగా ఆ ప్రతిపాదనను ఆర్టీసీ విరమించుకుంది. అయితే హెచ్‌ఎండీఏ సాయంతో బస్సులను ప్రవే­­శపెట్టే దిశగా ఏడాదిగా ఆలోచన చేస్తున్నా కార్యరూపం దాల్చలేదు. అదే ముంబైలో మాత్రం విద్యుత్‌తో నడిచే డబుల్‌ డెక్కర్‌ బస్సుల ప్రవేశానికి ఆ నగర రవాణా సంస్థ ఏర్పాట్లు చేస్తోంది.  

మెట్రో నగరాల్లో ఇలా
►సుమారు 3.2 కోట్ల జనాభా కలిగిన ఢిల్లీలో మెట్రో రైలు సదుపాయాలను గణనీయంగా విస్తరించారు. మరోవైపు ప్రస్తుతం అక్కడ నడుస్తున్న 6,000కుపైగా సిటీ సీఎన్‌జీ బస్సుల స్థానంలో 2025 నాటికి పూర్తిగా విద్యుత్‌ ఆధారిత ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టారు. 

►సుమారు 2.09 కోట్ల జనాభా కలిగిన ముంబై నగరంలో ప్రతిరోజూ 600కు పైగా లోకల్‌ రైళ్లు తిరుగుతున్నాయి. 4,000 కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులను కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతం 2,500 బస్సులకు ఆర్డర్‌ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే 300 బస్సులు బృహన్‌ ముంబై విద్యుత్‌ సరఫరా, రవాణా (బెస్ట్‌)కు చేరాయి. మరో 100 ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. 

►బెంగళూరు మహానగరంలో 6,000 ఏసీ బస్సులు తిరుగుతున్నాయి. ప్రయాణికుల రద్దీ మేరకు మరో 2,500 బస్సులను కొత్తగా కొనుగోలు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. దశలవారీగా 12,000 బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు  రూపొందించింది.   

విఫలమైన కనెక్టివిటీ
ప్రపంచంలోని ఏ నగరంలోనైనా వివిధ రకాల ప్రజారవాణా వాహనాల మధ్య పటిష్టమైన కనెక్టివిటీ ఉంటుంది. లండన్‌ మహానగరంలో సుమారు 19,000 బస్సులతో రైల్వే వ్యవస్థకు కనెక్టివిటీ ఏర్పాటు చేశారు. ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి ప్రజారవాణాపై సమగ్ర సమీక్ష నిర్వహించి సదుపాయాలను విస్తరిస్తారు. హైదరాబాద్‌లో నాలుగు మార్గాల్లో మెట్రో రైళ్లు, ఫలక్‌నుమా–సికింద్రాబాద్‌–లింగంపల్లి వంటి రద్దీ రూట్ల­లో ఎంఎంటీఎస్‌ అందుబాటులో ఉన్నా సిటీ బస్సులతో కనెక్టివిటీ లేదు.

హైదరాబాద్‌ మహానగరం ఇప్పుడు 7 జిల్లాల పరిధిలో విస్తరించింది. నగర శివా­ర్ల నుంచి నగరంలోని ప్రధాన మార్గాలను అనుసంధానిస్తూ సర్వీసులనునడపాలనే ప్రజల డిమాండ్‌ మేరకు బస్సులు లేకపోవడం గమనార్హం. 

మరిన్ని వార్తలు