త్వరలో ఆర్టీసీ ‘జీవా’జలం! 

6 Jan, 2023 02:18 IST|Sakshi
బాటిల్‌ నీళ్లను విక్రయించనున్న రవాణా సంస్థ  

తొలుత బస్టాండ్లలో, ఆ తర్వాత సాధారణ దుకాణాల్లో అందుబాటులో 

వారం పదిరోజుల్లో విడుదల 

ఏడాదికి రూ.25 కోట్ల ఆదాయం పొందే ప్లాన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: సొంతంగా మంచినీటిని తయారు చేసి బస్టాండ్లలో విక్రయించడంతోపాటు మార్కెట్‌లోకి కూడా విడుదల చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఆకట్టుకునే రీతిలో మంచినీటి సీసా డిజైన్‌ను రూపొందించింది. దీనికి ప్రకాశం, కాంతి అన్న అర్ధంలో వినియోగించే జీవా (జెడ్‌ఐవీఏ) అన్న పేరును ఖరారు చేసింది. దీనికి జీవం అన్న మరో అర్థం కూడా ఉండటం విశేషం. ‘స్ప్రింగ్‌ ఆఫ్‌ లైఫ్‌’అన్న ట్యాగ్‌ను దీనికి జతచేసింది. మరో వారం పది రోజుల్లో ఈ బ్రాండ్‌ మంచినీటిని ఆర్టీసీ విడుదల చేస్తోంది. తొలుత అన్ని ఆర్టీసీ బస్టాండ్లలో వీటిని అందుబాటులో ఉంచుతారు. ఆ తర్వాత క్రమంగా విస్తరించాలని నిర్ణయించింది.  

నకిలీలను నియంత్రించి.. 
ఆర్టీసీ బస్టాండ్లలో ఉండే దుకాణాల్లో మంచినీటి సీసాల విక్రయం విరివిగా సాగుతుంది. అదే వేసవిలో అయితే వాటి వినియోగం చాలా ఎక్కువ. దీంతో దుకాణదారులు రూ.20కి విక్రయించాల్సిన లీటరు నీటి సీసాను రూ.25–30కి అమ్ముతుంటారు. బ్రాండెడ్‌ పేర్లను పోలిన ‘నకిలీ’కంపెనీ నీళ్లు విక్రయిస్తుంటారు. ఇటీవలే వీటిని నియంత్రించిన ఆర్టీసీ ఇప్పుడు బ్రాండెడ్, ఐఎస్‌ఐ అధీకృత లోకల్‌ కంపెనీ నీళ్లు మాత్రమే అందుబాటులో ఉండేలా చేయగలిగింది. ఈ తరుణంలోనే తనే సొంతంగా నీటి విక్రయాలను ప్రారంభించాలన్న ఆలోచనను సాకారం చేసుకుంటోంది.  

పేటెంట్‌ కోసం దరఖాస్తు 
ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు ఉచితంగా అరలీటరు నీటి సీసాలను అందిస్తోంది. ఇందుకోసం ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక కార్యాలయాలు, ఇతర అవసరాలకు కూడా భారీగా ప్యాకేజ్డ్‌ నీటిని కొంటోంది. ఇందుకు సాలీనా రూ.5.15 కోట్ల ఖర్చును చూపుతోంది. ఇంత భారీ ఖర్చును తనే పెట్టుబడిగా మార్చుకుంటే సొంతంగా నీటిని మార్కెట్‌లోకి తేవచ్చన్న యోచనతో రెండు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఆ కంపెనీలు ఆకర్షణీయ సీసాల్లో నాణ్యమైన నీటిని నింపి ఆర్టీసీకి అందజేస్తాయి. వాటిని ఆర్టీసీ మార్కెటింగ్‌ చేసుకుంటుంది. ఇలా ఇతర కంపెనీల ధరలతో సమంగా లీటరు నీటికి రూ.20 ధరను ఖరారు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులకు ఉచితంగా అందించేందుకు అర లీటరు సీసాలను అందుబాటులో ఉంచుతారు.

బస్టాండ్లలోని దుకాణాల్లో మాత్రం లీటరు పరిమాణంలోని నీటి సీసాలను ఉంచుతారు. కాగా జీవా పేరుతో తెస్తున్న ఈ బాటిళ్లకు ‘స్ప్రింగ్‌ ఆఫ్‌ లైఫ్‌’అన్న ట్యాగ్‌లను పెట్టింది. పేరుకు, బాటిల్‌ డిజైన్‌కు ఆర్టీసీ పేటెంట్‌ కోసం దరఖాస్తు చేసినట్టు తెలిసింది. ఆర్టీసీ బస్టాండ్లతోపాటు మార్కెట్‌లోనూ ఈ సీసాలను అందుబాటులోకి తేవాలని సంస్థ నిర్ణయించింది. ఇప్పుడు ఒప్పందం మేరకు వేరే కంపెనీ నీటిని కొనేందుకు చేస్తున్న రూ.5 కోట్ల ఖర్చును లేకుండా చేసుకోవటంతోపాటు సాలీనా కనీసం రూ.20 నుంచి రూ.25 కోట్ల వరకు ఆదాయం పొందాలని భావిస్తోంది.  

మరిన్ని వార్తలు