అంతర్రాష్ట్ర ఏసీ బస్సుల చార్జీ తగ్గింపు 

3 Sep, 2022 02:50 IST|Sakshi

ఈనెలాఖరు వరకు 10 శాతం తగ్గింపు అమలు  

సాక్షి, హైదరాబాద్‌: అంతర్రాష్ట్ర ఏసీ బస్సు చార్జీలను 10 శాతం తగ్గిస్తూ టీఎస్‌ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం శుభకార్యాలకు ముహూర్తాలు లేకపోవటంతో బస్సు ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంది. ఏసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో కూడా బాగా పడిపోయింది. దీంతో ప్రయాణికులను ఆకట్టుకునే క్రమంలో టికెట్‌ ధరలను బేసిక్‌పై పది శాతం తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయించింది.

రెండు రోజుల క్రితం ఏపీఎస్‌ ఆర్టీసీ కూడా ఇదే కేటగిరీ బస్సుల్లో టికెట్‌ ధరలను తగ్గించుకుంది. దీంతో ఆంధ్ర ప్రాంతంవైపు వెళ్లే మార్గాల్లో, ప్రయాణికులు టీఎస్‌ ఆర్టీసీ ఏసీ బస్సుల కంటే ఏపీఎస్‌ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ఎక్కేందుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో తమ ఏసీ సర్వీసుల్లో కూడా టికెట్‌ చార్జీలను సవరించాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది.

శనివారం నుంచి అమల్లోకి వచ్చే కొత్త చార్జీలు ఈ నెలాఖరు వరకు కొనసాగనున్నట్టు ఆర్టీసీ ఓ ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్‌–విజయవాడ మధ్య నడిచే గరుడప్లస్, రాజధాని సర్వీసుల్లో శుక్ర, ఆదివారాలు మినహా మిగతా రోజుల్లో 10 శాతం తగ్గింపు వర్తిస్తుందని, బెంగుళూరు నుంచి హైదరాబాద్‌ వచ్చే సర్వీసుల్లో శుక్రవారం, హైదరాబాద్‌ నుంచి బెంగుళూరు వైపు వెళ్లే ఏసీ బస్సుల్లో ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఈ తగ్గింపు వర్తిస్తుందని పేర్కొంది. 

మరిన్ని వార్తలు