ఇక అన్ని బస్సులు రోడ్లపైకి.. 

22 Jan, 2021 08:34 IST|Sakshi

ఫిబ్రవరి 1 నుంచి తిప్పాలని భావిస్తున్న ఆర్టీసీ 

లాక్‌డౌన్‌ పరిమితులకు ఇక సెలవు 

విద్యాసంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్ణయం 

ప్రైవేటు వాహనాలకు మళ్లిన వారిని వెనక్కి రప్పించే యత్నం 

రవాణా శాఖతో కలసి ఆర్టీఏ తనిఖీలు.. 

పరిమితికి మించి ప్రయాణికులు ఉంటే చర్యలు 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కారణంగా లాక్‌డౌన్‌ నిబంధనలతో పరిమితంగా నడుస్తూ వచ్చిన ఆర్టీసీ బస్సులు ఇక పూర్తిస్థాయిలో రోడ్డెక్కనున్నాయి. ఫిబ్రవరి ఒకటి నుంచి.. బస్సులన్నీ ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఫిబ్ర వరి 1 నుంచి 9వ తరగతి ఆపై తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పూర్తిస్థాయిలో బస్సులు తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడం, యూకే స్ట్రెయిన్‌ ప్రభావం అంతగా కన్పించకపోవడంతో మిగతా తరగతులు కూడా వీలైనంత తొందరలోనే ప్రారంభమవుతాయని ఆర్టీసీ అంచనా వేస్తోంది. దీంతో ఇక డిపోలకు పరిమితం చేస్తున్న బస్సులను కూడా బయటకు తీయాలని నిర్ణయించింది. 

మెరుగుపడని ఆక్యుపెన్సీ రేషియో 
ప్రస్తుతం దాదాపు 90 శాతం బస్సులు రోడ్లపై తిరుగుతున్నాయి. అయితే ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌) మాత్రం మెరుగుపడట్లేదు. ప్రస్తుతం 65 శాతం ఓఆర్‌ నమోదవుతోంది. ప్రస్తుతం జనంలో కోవిడ్‌ భయం దాదాపు పోయింది. వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావటంతో జనంలో ధైర్యం వచ్చింది. కొద్దోగొప్పో భయంతో ఉన్నవారు కూడా క్రమంగా రోజువారీ పనుల్లో బిజీ అయిపోతున్నారు. కానీ బస్సులెక్కే ప్రయాణికుల సంఖ్య మాత్రం పెరగట్లేదు. బస్సు ప్రయాణం సురక్షితం కాదన్న ఉద్దేశంతోనే ప్రయాణికులు బస్సులకు దూరంగా ఉంటున్నారన్న భావనతో ఆర్టీసీ ఉండేది. అయితే కొద్దిరోజులుగా అధికారులు వివిధ ప్రాంతాల్లో సర్వే చేస్తున్నారు. ఆటోలు సహా ఇతర ప్రైవేటు వాహనాల్లో ప్రయాణికులు కిక్కిరిసి వెళ్తున్న తీరును గుర్తించారు. కోవిడ్‌ భయం ఉంటే ప్రైవేటు వాహనాల్లో కూడా ప్రయాణించేవారు కాదని నిర్ధారణకు వచ్చారు. వెరసి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించటానికి అలవాటు పడి ఆర్టీసీని దూరం చేసుకుంటున్నారని గుర్తించారు. ప్రజల్లో మార్పు వచ్చేలా చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. 
(చదవండి: చార్జీలు పెంచకుంటే బస్సు గట్టెక్కదు)

ఆర్టీఏ ఆధ్వర్యంలో తనిఖీలు.. 
ప్రైవేటు వాహనాల్లో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రమాదకరంగా తిరుగుతున్న తీరును ఆర్టీసీ అధికారులు రవాణా శాఖ దృష్టికి తెచ్చారు. దీనివల్ల ప్రమాదాలు జరగటంతో పాటు ఆర్టీసీ కూడా తీవ్రంగా నష్టపోతోందని పేర్కొన్నారు. దీంతో ఇక కొంతకాలం పాటు ప్రైవేటు వాహనాలపై కొరడా ఝలిపించాలని రవాణా శాఖ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఆర్టీసీకి అటాచ్‌ చేశారు. పరిమితికి మించి ప్రయాణికులను తరలించే వాహనాలపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోనున్నారు. దీనివల్ల ప్రయాణికులు మళ్లీ బస్సుల వైపు మళ్లుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.  

మే వరకు కష్టకాలమే.. 
శుభకార్యాలంటే ఆర్టీసీకి పండుగే. ఆ సమయంలో బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య బాగా పెరుగుతుంది. ప్రస్తుతం శుభముహూర్తాల కాలం ముగిసింది. మే రెండో వారం వరకు ముహూర్తాలు కూడా లేవు. దీంతో బస్సు ప్రయాణికుల సంఖ్య అంతగా పెరగదని అంచనా వేస్తున్నారు. సంక్రాంతి రద్దీ కూడా ఈ సారి తక్కువగానే ఉంది. తిరుగుపయనమైన వారి సంఖ్య కూడా బస్సుల్లో తక్కువగా నమోదైంది. పండుగ తర్వాతి రోజు ఎక్కువ రద్దీ ఉంటుందని ఊహించినా.. ఆశించినంతగా నమోదు కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సగటు ఓఆర్‌ 66 శాతంగా నమోదైంది. ఆదాయం రూ.12.54 కోట్లుగా తేలింది. గత సంక్రాంతి సమయంలో ఇది రూ.14 కోట్లుగా నమోదైంది. ఖమ్మం, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల పరిధిలో మాత్రమే ఓఆర్‌ 70 శాతం మించింది.
 

మరిన్ని వార్తలు