ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం.. డ్యూటీ వేయడం లేదనే ఆవేదనతో.. 

29 Aug, 2021 11:10 IST|Sakshi
ఆస్పత్రిలో చికిత్స పొందున్న డ్రైవర్‌ బల్‌రాం 

సాక్షి, బాన్సువాడ(నిజామాబాద్‌): డ్రైవర్లకు, కండక్టర్లకు డ్యూటీలు వేసే అధికారిణి తనకు నాలుగురోజులుగా డ్యూటీ వేయకుండా ఇంటికి పంపిస్తోందని ఆవేదన చెందిన బల్‌రాం అనే ఆర్టీసీ డ్రైవర్‌ శనివారం మధ్యాహ్నం డిపోలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలిలా ఉన్నాయి. బాన్సువాడ ఇస్లాంపూర కాలనీకి చెందిన డ్రైవర్‌ బల్‌రాం మంగళవారం ఆఫ్‌ ఉండడంతో తన కూతురుని తీసుకుని హైదరాబాద్‌లో కౌన్సెలింగ్‌కు వెళ్లాడు.

బుధవారం ఉదయం 6 గంటలకు డ్యూటీకి రావాల్సి ఉండగా 6:30 నిమిషాలకు ఆర్టీసీ డిపోకు వెళ్లాడు. అరగంట డ్యూటీకి ఆలస్యంగా వచ్చాడని డ్యూటీలు కేటాయించే అధికారిణి(ఎస్‌టీఐ) బల్‌రాంకు డ్యూటీ వేయలేదు. దీంతో ఇంటికి వెళ్లిన బల్‌రాం మరుసటి రోజు ఉదయమే డ్యూటీకి రాగా మళ్లీ డ్యూటీ వేయకుండా తిప్పిపంపించింది. ఇలా నాలుగు రోజులుగా డ్యూటీ కేటాయించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నా రని ఆవేదన చెందిన బల్‌రాం డిపోలో తన వెంట తీసుకొచ్చిన పురుగుల మందును సేవించాడు. విషయం గమనించి అక్కడే ఉన్న మిగితా కార్మికులు బల్‌రాంను వెంటనే బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి సిబ్బంది వెంటనే చికిత్స చేయడంతో ప్రమాదం తప్పింది.

ఆస్పత్రిలోబల్‌రాం భార్య సునీత రోదించిన తీరు అందరినీ కలిచివేసింది.తన భర్తకు డ్యూటీ వేయకపోవడంతో రోజు ఇంటి దగ్గర ఏడ్చేవాడని, తాను ధైర్యం చెప్పినప్పటికీ ఇలా ఆత్మహత్యాయత్నం చేసుకోవడం బాధగా ఉందని అమె పేర్కొంది. బల్‌రాంకు కుతురు, కుమారుడు ఉన్నారు. ‘సాక్షి’లో ఇటీవల సదరు డ్యూటీలు వేసే అధికారిణి కార్మికులను తీవ్రంగా వేధిస్తోందంటూ కథనాలు కూడా ప్రచురితమయ్యాయి.  
చదవండి: పదేళ్ల క్రితం అదృశ్యం: పుట్టింటికి రప్పించిన రాఖీ పండుగ

మరిన్ని వార్తలు