జీతాలివ్వండి మహాప్రభో..

11 Jan, 2021 16:15 IST|Sakshi
నిరసనలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులు

మొర పెట్టుకుంటున్న ఆర్టీసీ ఉద్యోగులు

సాక్షి, రాజన్న సిరిసిల్ల: ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పెంచుతాం.. అని ప్రభుత్వం బీరాలు పలికిందే తప్ప కనీసం సమయానికి జీతాలివ్వడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. మరికొద్ది రోజుల్లో సంక్రాంతి పండగ ఉన్న తరుణంలో తమకు వెంటనే జీతాలు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఒకటో తారీఖు దాటిపోయి పది రోజులవుతున్నా జీతాలు చెల్లించకపోవడంతో సిరిసిల్లలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సోమవారం నిరసన చేపట్టారు. జీతాలు పెంచుతున్నట్లు జనాల్లో అపోహలు సృష్టిస్తున్నారే తప్ప చేసిందేమీ లేదని పెదవి విరుస్తున్నారు. ఇంకా ఒక్క రూపాయి కూడా చేతికి రాకపోవడంతో పండగ ఎట్లా జరుపుకునేదని తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే జీతాలు పడేట్లు చూడాలని కోరుతున్నారు. (చదవండి: మేం మారం.. మార్చం!)

5న జీతాలివ్వండి
సమయానికి జీతాలు ఇవ్వకపోవడంతో లోన్ల విషయంలో చాలా ఇబ్బంది అవుతోంది. పెనాల్టీలు పడుతున్నాయి. కుటుంబాన్ని పోషించుకోలేని దుఃస్థితికి వెళుతున్నాం. కాబట్టి ప్రభుత్వం మా మీద దయ చూపి కనీసం ఐదో తారీఖున జీతాలు పడేలా చర్యలు తీసుకోవాలి.
- పాపన్నగారి దేవయ్య, ఆర్టీసీ కండక్టర్‌, సిరిసిల్ల డిపో

మరిన్ని వార్తలు